వారణాసిలో మోదీపై కమెడియన్ పోటీ.. హాట్‌టాపిక్‌గా శ్యామ్ రంగీలా ప్రకటన

లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రముఖ కమెడియన్ శ్యామ్ రంగీలా ప్రకటించాడు.

Comedian Shyam Rangeela: ప్రధాని నరేంద్ర మోదీని మిమిక్రీ చేసి పాపులర్ అయిన ప్రముఖ కమెడియన్ శ్యామ్ రంగీలా.. లోక్‌సభ ఎన్నికల్లో ఆయనపైనే పోటీకి రెడీ అవుతున్నాడు. వారణాసిలో మోదీపై పోటీ చేస్తానని బుధవారం ఎక్స్(ట్విటర్)లో ప్రకటించాడు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించాడు.

“లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత మీ అందరి నుంచి నాకు లభిస్తున్న ప్రేమను చూసి నేను సంతోషిస్తున్నాను. వారణాసి చేరుకున్న తర్వాత నా నామినేషన్, ఎన్నికల్లో పోటీ చేయడంపై నా అభిప్రాయాలను వీడియో ద్వారా త్వరలో మీకు తెలియజేస్తాన”ని పేర్కొన్నాడు. గతంలో మోదీకి మద్దతుగా ప్రచారం చేశానని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు.

మీడియాతో శ్యామ్ రంగీలా మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్ర మోదీకి నేను ఫాలోయర్‌ని. ఆయనకు మద్దతుగా చాలా వీడియోలు షేర్ చేశాను. రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌లకు వ్యతిరేకంగా కూడా వీడియోలు షేర్ చేశాను. ఆ వీడియోలు చూసినవారెవరైనా.. వచ్చే 70 ఏళ్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే నేను ఓటేస్తానమో అనుకుంటారు. కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి మారింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. సూరత్, ఇండోర్‌లా కాకుండా.. వారణాసిలో ఓటువేసే ప్రజలకు నేను మరో ఆప్షన్ అవుతాను. నేను ఈ వారం వారణాసికి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేస్తాన”ని చెప్పారు.

Also Read: బీజేపీలో చేరిన ప్రముఖ నటి రూపాలీ గంగూలీ, జ్యోతిష్కుడు అమేయ జోషి

ఎవరు ఎప్పుడు నామినేషన్ ఉపసంహరించుకుంటారో తెలియదు కాబట్టే వారణాసిలో తాను పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, సూరత్ లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇండోర్ నియోజకవర్గంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకుని.. బీజేపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే శ్యామ్ రంగీలా పోటీ హాట్‌టాపిక్‌గా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు