కరోనా కట్టడి విషయంలో భారత చర్యలు బేష్ అని WHO ప్రశంసించింది. ఇతర దేశాలతో పోల్చిచూస్తే కరోనా కేసులు,మరణాల సంఖ్య భారత్ లో చాలా తక్కువగా ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. అంతేకాకుండా కరోనాకు వ్యాక్సిన్ ను డెవలప్ చేసే విషయంలో భారత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు ఆమె తెలిపారు.
కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి పట్ట మరికొన్ని నెలలు లేదా దాదాపు ఏడాది పాటు ప్రపంచంలోని దేశాలన్ని సిద్దంగా ఉండాలని ఆమె సూచించారు. కేవలం డెవలప్ చేసి వ్యాక్సిన్ ను టెస్ట్ చేయడంతో సరిపోదని, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కూడా చాలా ముఖ్యమైనదని తెలిపారు.
ఇవాళ(మే-11,2020)నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ఆమె మాట్లాడుతూ…అద్భుతమైన పనితీరుతో భారత్ కరోనా వ్యాప్తిని పరిమితం చేయగలిగిందని మరియు ఇతర దేశాలతో పోల్చితే మరణాల సంఖ్యను బాగా తగ్గించగలిగిందని…దీనికి తాను మంత్రులను,సహచరులను ప్రశంసిస్తున్నట్లు, అభినందిస్తున్నట్లు తెలిపారు.
కాగా,ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 42లక్షల 8వేల 83కేసులు నమోదుకాగా,2లక్షల 84వేల 398మంది ప్రాణాలు కోల్పోయారు. 15లక్షల 4వేల 586మంది కోలుకున్నారు. ఇక భారత్ లో 67,700కేసులు నమోదుకాగా,21,130మంది కోలుకున్నారు. 2,215 కరోనా మరణాలు భారత్ లో నమోదయ్యాయి. మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు,మరణాలు నమోదయ్యాయి. దేశంలో రికవరీ రేటు 31.15శాతం ఉన్నట్లు కేంద్రఆరోగ్యశాఖ ప్రకటించింది.