సామాన్యుడి దీపావళి కేంద్రం చేతిలో… సుప్రీంకోర్టు

Common Man’s Diwali In Centre Hands సామాన్యుడి దీపావళి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మారటోరియం కాలంలో 8కేటగిరీలకు 2కోట్టరూపాయల వరకు ఉన్న లోన్ లపై వడ్డీ రద్దు విషయమై తమకు నెల రోజులు సమయం కావాలంటూ కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ(అక్టోబర్-14,2020)సుప్రీంకోర్టు కొట్టివేసింది. మారటోరియం సమయంలో MSME లపై వడ్డీ..2కోట్ల లోపు వ్యక్తిగత రుణాలపై వడ్డీ రద్దుకు కేంద్రం ఇదివరకు అంగీకరించిన విషయం తెలిసిందే.



కరోనావైరస్-లాక్ డౌన్ కారణంగా రుణాలను కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఉపశమన చర్యల కోసం కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా…దాన్ని అమలు చేయడానికి ఎందుకు అంత సుదీర్ఘమైన సమయం కావాలి అని జస్టిన్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.

సామాన్యులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2కోట్ల లోపు లోన్ లు ఉన్న వ్యక్తుల పరిస్థితి తమకు ఆందోళన కలిగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఇప్పటికే కేంద్రం ఈ విషయంలో నవంబర్-15లోగా లోన్ ల వడ్డీ రద్దును అమలుచేయడానికి నిర్ణయం తీసుకొని..మళ్లీ ఇప్పుడు నెలరోజుల సమయం కోరుతూ ఎందుకు ఆలస్యం చేస్తుందని కోర్టు ప్రశ్నించింది. తమ నిర్ణయానికి అనుగుణంగా కేంద్రం వెంటనే అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కోర్టు సూచించింది.


సామాన్యుడిని ఇబ్బందులను కేంద్రం పరిగణలోకి తీసుకుందని… అనవసరంగా తన నిర్ణయాన్ని ఆలస్యం చేయడం వల్ల కేంద్రానికి ఒరిగేదేమీ లేదని..కానీ కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయని..అవి పూర్తవ్వాలని కేంద్రప్రభుత్వం తరపున సొలిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకి తెలియజేశారు. కేంద్రం తమ నిర్ణయాన్ని అమలుచేసేందుకు బ్యాంకులు తమకు సరైన ఫార్మాట్ ఇచ్చేలా చూడాలి అని మెహతా కోర్టుకి తెలిపారు. నవంబర్-2కు ఈ విచారణను కోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ సమయానికి కేంద్ర నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు