Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్, ఆప్ స్పందన ఇదే.. బిల్లును వ్యతిరేకించిన ఒవైసీ

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యంతరాలను తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు ప్రవేశపెట్టబడినా మహిళలకు దాని ప్రయోజనాలు త్వరలో అందేలా కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

Womens Reservation Bill (Google Image)

Womens Reservation Bill: కొత్త పార్లమెంట్ హౌస్‌లో తొలిరోజునే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ దీనిని ప్రవేశపెట్టారు. కాగా, ఈ బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరగనుంది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. గురువారం రాజ్యసభలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు బిల్లు ప్రయోజనాలు త్వరలో అందేలా కనిపించడం లేదని పలు విపక్ష పార్టీలు పేర్కొంటున్నాయి.

మోదీ మరో మోసపూరిత చర్యకు తెరతీశారు.. కాంగ్రెస్
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యంతరాలను తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు ప్రవేశపెట్టబడినా మహిళలకు దాని ప్రయోజనాలు త్వరలో అందేలా కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ కసరత్తులు పూర్తయిన తర్వాతే బిల్లు అమల్లోకి వస్తుంది. ఈ జనాభా గణనను ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. దీని అర్థం ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ మరో మోసపూరిత చర్యకు తెరతీశారని కాంగ్రెస్ పేర్కొంది.

Read Also: Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మార్చడంలో 27 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి? పూర్తి చరిత్ర తెలుసుకోండి.

2024 నుంచే అమల్లోకి తేవాలి.. ఆప్

మహిళా రిజర్వేషన్ బిల్లు తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. 2024 ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వనట్లయితే, ఈ బిల్లు మహిళలను మోసం చేసే బిల్లుగా ఆ పార్టీ అభివర్ణించింది. ఈ బిల్లులో జనాభా గణన నిబంధనను చేర్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. ఈ బిల్లులో డీలిమిటేషన్ నిబంధనను చొప్పించాల్సిన అవసరం ఏమిటంటూ ఆప్ ప్రశ్నించింది. ప్రభుత్వం ప్రతిపాదిత చట్టానికి సవరణలు చేసి 2024 ఎన్నికల నుంచే మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు.

AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఏమన్నారంటే..

మహిళా రిజర్వేషన్ బిల్లును AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. తాజా బిల్లులో ముస్లిం మహిళలకు కోటా లేకపోవడం పెద్దలోపం అన్నారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేని వారికి ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ బిల్లులోని ప్రధాన లోపం ఏమిటంటే ముస్లిం మహిళలకు కోటా లేదు కాబట్టి మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

Read Also: Chandrababu Case : చంద్రబాబు కేసులో హేమాహేమీలు, నలుగురూ పేరున్న క్రిమినల్ లాయర్లే.. ఎవరి వాదన నెగ్గుతుంది? సర్వత్రా ఉత్కంఠ

ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఏమన్నారంటే..

మహిళా రిజర్వేషన్ బిల్లులో లింగ న్యాయం, సామాజిక న్యాయం సమపాళ్లలో ఉండాలి. ఈ బిల్లులో వెనుకబడిన, దళిత, మైనార్టీ, గిరిజన మహిళలకు రిజర్వేషన్లు నిర్ధిష్ట శాతం రూపంలో స్పష్టంగా పేర్కొనాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు.