No Confidence Motion
No Confidence Motion: కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన అస్త్రం ప్రయోగించేందుకు విపక్ష కూటమి ‘ఇండియా’ సిద్ధమైంది. ఈ మేరకు లోక్‌సభ కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపట్టేందుకు స్పీకర్ కు నోటీసులిచ్చారు. కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. మణిపూర్ అంశంపై ఉభయసభల్లో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడడం లేదని బీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. రూల్ 198 (బి) కింద ఈ అవిశ్వాస నోటీసుపై చర్చ చేపట్టాలని ఎంపీ నామా కోరారు.
కేంద్ర ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం అద్భుత అవకాశం – బీజేపీ ఎంపీ జీవీఎల్
కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విపక్షాల వెర్రికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. సంఖ్యా పరంగా అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని చెప్పారు. బీజేపీ ఎన్డీఏకి 330 పైగా సంఖ్యాబలం ఉందని అన్నారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల దుమ్ము దులుపుతారని జీవీఎల్ అన్నారు. విపక్షాల అవిశ్వాసం వారి సెల్ఫ్ డిస్ట్రక్షన్ బటన్ మాత్రమే. కేంద్ర ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం అద్భుత సువర్ణ అవకాశం. అవిశ్వాసం వల్ల బీజేపీకి నష్టం లేదని జీవీఎల్ అన్నారు. పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు మా విజయాలను, పాలనను తెలుపుకునే అవకాశం లభించిందని చెప్పారు. అవిశ్వాసం చర్చ సందర్భంగా మణిపూర్ అంశంపైనా మోడీ మాట్లాడుతారని జీవీఎల్ అన్నారు.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామ్ – వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మణిపూర్ అంశం మీద హోం మంత్రి అమిత్ షా చర్చకు సిద్ధమని, సమాధానం చెబుతానని అన్నారని విజయసాయి చెప్పారు. మణిపుర్ దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశమని, ఇది పూర్తిగా కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
అలా జరిగితే అదే అతిపెద్ద విజయం – RJD ఎంపీ మనోజ్ ఝా
సంఖ్యా బలం మాకు అనుకూలంగా లేదని మాకు తెలుసు. కానీ, ప్రజాస్వామ్యం కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదు. మణిపూర్ మండుతోంది. ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారని వేచి ఉన్నారు. బహుశా అవిశ్వాసంతో అయినా మోడీలో చలనం, మాట్లాడేలా చేయవచ్చు. అదే అతిపెద్ద విజయం అవుతుందని RJD ఎంపీ మనోజ్ ఝా అన్నారు.
అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం – బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు
బీఆర్ఎస్ పార్టీ తరపున అవిశ్వాస తీర్మానం పెట్టామని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష నేతలంతా మణిపూర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రధాని మాట్లాడితే దేశ ప్రజల్లో శాంతి నెలకొంటుంది. అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని నామా చెప్పారు.