మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు కాంగ్రెస్, శివసేన పార్టీలు మాస్టర్ ప్లాన్ కు రెడీ అయ్యాయి. మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ చైర్ పర్సన్, పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అంగీకరించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ తో సోనియా భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ నేతలను ఆమె ఆదేశించారు.
సోనియాతో పవార్ భేటీతో రాష్ట్రంలో శివసేనతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమైనట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీ కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూఢిల్లీలోని 6 జన్ పాత్ దగ్గర సుప్రియా స్యూలే నివాసంలో (నవంబర్ 20, 2019) సాయంత్రం NCP నేతలతో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇరు పార్టీల నేతలు చర్చించనున్నారు. కేబినెట్ పొర్ట్ పొలియో, కనీస ఉమ్మడి కార్యక్రమం (CMP)కు సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో ఎన్సీపీ నేత శరద్ పవార్ భేటీ అనంతరం మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వ ఏర్పాటుపైనే పడింది. ఎన్నో ఏళ్ల వైరాన్ని పక్కనపెట్టి శివసేనతో జతకట్టే విషయంలో కాంగ్రెస్ తర్జనభర్జన పడుతూ వచ్చింది. తమ నిర్ణయాన్ని నాన్చుతూ వచ్చి చివరికి శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. మరోవైపు శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
సోనియాతో భేటీలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని(సీఎంపీ)పై చర్చించలేదని తెలుస్తోంది. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులపై మాత్రమే సోనియాతో ఆయన చర్చించినట్టు కనిపిస్తోంది. భేటీ అనంతరం శివసేనతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై సోనియా సోమవారమే నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అన్ని అనుకున్నట్టుగా.. కాంగ్రెస్-ఎన్సీపీ నేతల మధ్య చర్చలు సజావుగా సాగితే మాత్రం.. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ఖాయమైనట్టే. ఇదే జరిగితే.. వచ్చే డిసెంబర్ తొలివారంలోనే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుంది.