Rahul Gandhi : ట్విట్టర్‌ తీరుపై రాహుల్ గాంధీ ఫైర్

కాంగ్రెస్ వర్సెస్ ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ట్విట్టర్‌ ఖాతాలను నిలిపివేయడంపై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నారు.

Rahul Gandhi fires on Twitter : కాంగ్రెస్ వర్సెస్ ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ట్విట్టర్‌ ఖాతాలను నిలిపివేయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నారు. ట్విట్టట్ ఖాతాలు బ్లాక్ చేయడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. పక్షపాతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏది చెబితే అది ట్విట్టర్ వింటోందన్నారు. తన ఖాతాను బ్లాక్ చేయడం ద్వారా దేశ రాజకీయ ప్రక్రియలో ట్విట్టర్ జోక్యం చేసుకుంటోందన్నారు. అభిప్రాయాలను వినిపించేందుకు ట్విట్టర్ సరైన వేదిక అనే ఓ ఆశ ఇదివరకు ఉండేదని.. ఇప్పుడు అలా లేదన్నారు. తనతో పాటు లక్షలాది మంది ఫాలోవర్ల భావప్రకటనా హక్కును ట్విట్టర్ హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ నిస్పాక్షికంగా లేదన్న విషయం వాస్తవమన్నారు. ట్విట్టర్ కేవలం తన ఖాతాను నిలిపివేసినట్లు కాదని…తనకు 19-20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారని.. వారి భావ వ్యక్తీకరణ హక్కునూ ట్విట్టర్ తిరస్కరిస్తుందని మండిపడ్డారు. రాజకీయంగా ఓ పక్షానికి మద్దతు ఇవ్వడం వల్ల ట్విట్టర్​కు ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.

ట్విట్టర్ తన వ్యాపారం కోసం దేశ రాజకీయాలను ఉపయోగించుకుంటోందని రాహుల్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాన్ని పార్లమెంట్‌లో మాట్లాడనీయకుండా చేస్తున్న ప్రభుత్వం… సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి తలొగ్గే సంస్థలకే దేశంలో అనుమతులు ఉంటాయా? అని రాహుల్ ప్రశ్నించారు. కేంద్రం ఒత్తిళ్ల కారణంగానే ట్విట్టర్ తమ అకౌంట్లపై చర్యలు తీసుకుందని మరోసారి ఆరోపించారు.

ఢిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలిక కుటుంబ సభ్యుల చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు తాత్కాలికంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ నిలిపివేసింది. కాంగ్రెస్ అధికారిక ఖాతాతోపాటు నిబంధనలను ఉల్లంఘించిన మరో 5 వేల కార్యకర్తల అకౌంట్లను బ్లాక్ చేసింది. కాంగ్రెస్ నిబంధనలు అతిక్రమించడం వల్లే ఆ పార్టీ అకౌంట్‌ను, నేతల ఖాతాలను బ్లాక్ చేశామని ట్విట్టర్ ప్రకటించింది.

ఐదుగురు పార్టీ నేతల ఖాతాలతో పాటు..పార్టీ అధికారికి అకౌంట్‌ను కూడా ట్విట్టర్ బ్లాక్ చేసింది. ట్విట్టర్ పార్టీ అధికారిక ఖాతాను బ్లాక్ చేసిన మెసేజ్‌ను కాంగ్రెస్ నేతలు స్క్రీన్ షాట్ తీసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాంగ్రెస్ అకౌంట్ నిబంధనలు అతిక్రమించిందని, ఇతర వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా అకౌంట్‌లో పోస్టు చేసిందని ట్విట్టర్ ఆరోపించింది.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మానెకన్‌, పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా, పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, కేంద్ర మాజీ మంత్రి, అసోం రాష్ట్ర ఇన్‌చార్జి జితేంద్రసింగ్‌, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుశ్మితా దేవ్‌ ఖాతాలను ట్విటర్‌ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

 

ట్రెండింగ్ వార్తలు