Siddaramaiah Political Journey: కన్నడ రాజకీయాల్లో మాస్‌లీడర్‌గా సిద్ధరామయ్య.. మచ్చలేని రాజకీయ జీవితం ఆయన సొంతం

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్యపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణకూడా లేదు. మచ్చలేని రాజకీయ జీవితం సిద్ధరామయ్య సొంతం.

Siddaramaiah Political Journey

Siddaramaiah: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు మించి 135 స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు విజయంసాధించారు. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేకుండాపోయాయి. ఈ భారీ విజయం వెనుక అనేక మంది నేతల కఠోర శ్రమ ఉంది. వారిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి సిద్ధరామయ్య. కర్ణాటక రాష్ట్రంలో హస్తం పార్టీ స్ట్రాంగ్‌గా ఉందంటే పీసీసీ చీఫ్‌ డీకేతోపాటు మాజీ సీఎం సిద్ధరామయ్య కృషి అమోఘమని చెప్పాలి. కర్ణాటకలో ముగ్గురు ప్రజాదరణ ఉన్న నేతల్లో ఒకరు సిద్ధరామయ్య. మాస్ ఫాలోయింగ్ కలిగిన నేతతో పాటు, క్లీన్ ఇమేజ్ కలిగిన నేత సిద్ధరామయ్య.. దీంతో అధిష్టానంసైతం మరోసారి సిద్ధూకు సీఎం పదవి కట్టబెట్టేందుకు సిద్ధమైంది.

మాస్ ఫాలోయింగ్ కలిగిన నేత..

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు. రామ్‌మనోహర్‌ లోహియా సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చిన సిద్ధరామయ్య సెక్యులర్‌ వాది. 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయం సాధించిన సిద్ధరామయ్యకు కర్ణాటకలో ఎంతో మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది. అంతేకాదు కర్ణాటకలో ఐదేళ్లు పదవీ కాలం అనుభవించిన నేతల్లో సిద్ధరామయ్య ఒకరు. దేవరాజ్‌ ఆర్స్‌ తర్వాత ఆ ఘనత సాధించిన ఏకైక నేత సిద్ధరామయ్యే. గత 45 ఏళ్లలో ఐదేళ్లు సీఎంగా పనిచేసిన ఒకే ఒక్కడు సిద్ధరామయ్య. 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎంగా పనిచేసిన సిద్ధూ ఆ సమయం ప్రవేశపెట్టిన భాగ్య పథకాలు జనాదరణ పొందాయి.

2006లో కాంగ్రెస్ గూటికి సిద్ధ..

జనతాదళ్‌లో పనిచేసి ఆ పార్టీలో చీలిక తర్వాత దేవెగౌడ్‌ అనుచరుడిగా జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా నిలిచిన సిద్ధరామయ్య.. 2004లో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దేవెగౌడకు సమాంతరంగా ప్రజల్లో ఫాలోయింగ్‌ ఉండటంతో ఎప్పటికైనా దేవెగౌడ కుమారుడు కుమారస్వామికి ఇబ్బందులు తప్పవని గ్రహించి జనతాదళ్‌ ఎస్‌ నుంచి సిద్ధరామయ్యను బయటకు పంపారు. ఆ తర్వాత సిద్ధరామయ్యకు ఉన్న పలుకుబడి, జనబలం చూసిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నించాయి. కానీ, సెక్యులర్‌ వాదిగా గుర్తింపు ఉన్న సిద్ధరామయ్య రెండేళ్ల గ్యాప్‌ తర్వాత కాంగ్రెస్‌ను ఎంచుకుని 2006లో హస్తంపార్టీలో చేరారు. 2008లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడి నుంచి పార్టీకోసం ఎంతో శ్రమించి 2013లో కాంగ్రెస్‌ను గెలిపించి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు సిద్ధరామయ్య.

అవినీతి రహిత పాలనతో మన్ననలు..

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్యపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణకూడా లేదు. మచ్చలేని రాజకీయ జీవితం సిద్ధరామయ్య సొంతం. ఆయన క్లీన్‌ ఇమేజ్‌ కాంగ్రెస్‌ ప్రతిష్టను పెంచింది. వెనుకబడిన తరగతులు, ముస్లింలు, షెడ్యూలు కులాల సమూహం అహిందా నేతగా సిద్ధరామయ్య సుప్రసిద్ధులు. కురబ కమ్యూనిటీకి చెందిన సిద్ధరామయ్యను కన్నడ సీమలో పేదలు తమ దేవుడిగా భావిస్తారు. అంతలా గుర్తింపు సాధించిన సిద్ధరామయ్య తాజాగా కాంగ్రెస్‌ గెలుపులో క్రియాశీల పాత్ర పోషించారు.

ఇవే తనకు చివరి ఎన్నికలంటూ..

కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించాలనే ఉద్దేశంతో సిద్ధూ చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంది. ఇవే తనకు చివరి ఎన్నికలని సిద్ధరామయ్య చేసిన ప్రచారంతో ఓటర్లు బాగా ప్రభావితమయ్యారు. అవినీతి సర్కార్‌ను కూలదోశారు. కాంగ్రెస్‌ పార్టీ క్యాంపెయిన్‌ టీమ్‌లో సిద్ధరామయ్య ప్రధాన ఆకర్షణ. ఆయనకు పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ తోడుకావడంతో హస్తం పార్టీ కన్నడ సీమను హస్తగతం చేసుకోగలిగింది.