MLA Harish Singh Dhami : సీఎం ముందే మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదని రచ్చ.. మైక్ విసిరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!

MLA Harish Singh Dhami : సీఎం పుష్కర్ సింగ్ ధామి కార్యక్రమంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆగ్రహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ధామి చేతిలో మైక్ విసిరికొట్టి వేదికపై రచ్చ చేశారు. వైరల్ వీడియో ఇదే..

MLA Harish Singh Dhami

  • జాతర వేదికపై హైడ్రామా.. సీఎం వెళ్లగానే రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
  • మాట్లాడనీయలేదని ఆగ్రహం.. పోడియం, కుర్చీలు ధ్వంసం
  • మైక్ విసిరేసి ప్రభుత్వంపై హరీశ్ సింగ్ ధామి ఫైర్

MLA Harish Singh Dhami : ఉత్తరాఖండ్‌లో ఓ జాతర వేదిక రాజకీయ రచ్చకు కేంద్రంగా మారింది. ముఖ్యమంత్రి కార్యక్రమంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహించిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఏకంగా మైక్‌ను విసిరికొట్టారు. అంతటితో ఆగకుండా వేదికపై ఉన్న పోడియం, కుర్చీలను పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

10 రోజుల జాతరను ప్రారంభించిన సీఎం :
పితోరాగఢ్ జిల్లాలోని జౌల్జీబీ ప్రాంతంలో శనివారం 10 రోజుల జౌల్జీబీ జాతరను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు. భారత్, నేపాల్, టిబెట్ ప్రాంతాల మధ్య ఉన్న చారిత్రక వాణిజ్య సంబంధాలకు ఈ జాతర ప్రతీకగా నిలుస్తుంది. 3 ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయిస్తుంటారు..

అయితే, ఈ వేడుకలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. జాతర అధ్యక్షుడిగా ఉన్న ధార్చుల కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామి.. ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం :
సీఎం వెళ్లిపోయిన తర్వాత తన మద్దతుదారులతో కలిసి వేదికపైకి చేరుకున్నారు. మాట్లాడేందుకు ప్రయత్నించిన సమయంలో మైక్ నిలిపివేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో మైక్‌ను విసిరికొట్టి, వేదికపై ఉన్న వస్తువులను పడేశారు.

Read Also : KTR Comments : రాహుల్‌ వెంట పరుగులేంటి.. తెలంగాణ ఆత్మగౌరవం ఏమైంది? కాంగ్రెస్‌, బీజేపీపై కేటీఆర్‌ ఫైర్‌!

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ప్రజల సమస్యలను ప్రభుత్వం వినడానికి కూడా సిద్ధంగా లేదని మండిపడ్డారు. ముఖ్యంగా రెండ్రోజుల క్రితం మరణించిన ఎనిమిదేళ్ల బాలిక ఘటనతో పాటు కనార్ ప్రాంతంలో రహదారి సౌకర్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రస్తావించడం తప్పా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

ఎమ్మెల్యే ప్రవర్తన సిగ్గుచేటు :
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యే ప్రవర్తన సిగ్గుచేటని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఆదివారం మధ్యాహ్నంలోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించింది.. ప్రజల సమస్యలపై మొదలైన వివాదం ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోరుగా మారింది. జాతర వేదికపై జరిగిన ఈ హైడ్రామా ఉత్తరాఖండ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది..