ఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభలో రగడ జరిగింది. విపక్షాలు బిల్లుని వ్యతిరేకించాయి. పౌరసత్వ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు తగలబడతాయన్నారు. అయితే పౌరసత్వ బిల్లుతో ఎవరూ వివక్షకు గురికారు అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ బిల్లుపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమ వలసదారుల వల్ల అసోం ఎదుర్కొంటున్న సమస్యలు తమకు తెలుసన్నారు. పౌరసత్వ బిల్లును సవరించేందుకు దేశవ్యాప్తంగా ఎన్జీవోలు, ఇతర సంస్థలు సర్వేలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఆరేడేళ్లుగా దేశంలో నివసిస్తున్న విదేశీ వలసదారులకు భారత పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో.. కేంద్రం పౌరసత్వం సవరణ బిల్లు-2016ని లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు దాంతో పాటు దేశంలో చాలా ఏళ్లుగా నివసిస్తున్న వలసదారులకు పౌరసత్వం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది అసోంకి మాత్రమే సంబంధించినది కాదని స్పష్టం చేశారు. పశ్చిమ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వలసదారులు భారత్‌కు వచ్చారని అన్నారు. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వాళ్లు స్థిరపడ్డారని, చట్టబద్ధంగా ఉంటున్న వారికి పౌరసత్వం కల్పిస్తూనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆగ్రహంగా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు బంద్‌ను పాటిస్తున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల ఎంపీలు సభలో ఆందోళన చేశారు. అక్రమ వలసదారులతో స్వదేశీ సంస్కృతికి ముప్పు పొంచి ఉందని నినాదాలు చేశారు.