Karnataka Election 2023 : ప్రతి మహిళకు నెలకు రూ.2వేలు.. కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల ..

కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే మేనిఫెస్టో బుక్ ను రిలీజ్ చేశారు.

Karnataka Assembly Elections

Karnataka Election 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య, రాష్ట్ర శాఖ అధ్యక్షులు డీకే శివకుమార్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరాజీ ఇతర నేతలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో పలు కీలక అంశాలను కాంగ్రెస్ పార్టీ చేర్చింది. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు.

మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీలు ఇలా..

♦   పీఎఫ్ఐ సంస్థ‌తోపాటు భజరంగ్‌దళ్ సంస్థ‌పై నిషేధం.

♦   బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు.

♦   కర్నాటక‌లో ప్రతి మహిళకు నెలకు 2వేల ఆర్ధిక సహాయం.

♦   గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన నిరుద్యోగులకు రెండేళ్లపాటు నెలకు రూ. 3వేలు.

♦   నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ. 1500 అందజేత.

♦   ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరణకు హామీ.

♦   పాల ఉత్పత్తిదారులకు ఇచ్చే సబ్సిడీని లీటరుకు రూ.5 నుండి రూ. 7కు పెంపు.

♦   మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.

♦   రాత్రి విధులు నిర్వహించే పోలీసులకు నెలకు 5వేల రూపాయలు అలవెన్సు.

♦   నూతన విద్యా విధానం రద్దు, రాష్ట్ర విద్యా విధానం ఏర్పాటు.

♦   అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఒక సంవత్సరంలోగా భర్తీ చేసేలా కృషి.

♦   200యూనిట్ల ఉచిత విద్యుత్.

♦   పంచాయతీ స్థాయిలో సామాజిక సామరస్య మండలి ఏర్పాటు.

♦   అన్న భాగ్య పథకం కింద దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో చాలా మందికి బియ్యం, రాగులు, జొన్నలు, మిల్లెంట్ వంటి వాటిని ఎంపిక చేసుకున్న 10 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందించబడుతాయి.

 

ఇదిలాఉంటే.. బీజేపీ మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి ప్రతీరోజు ఉచితంగా అరలీటరు నందిని పాలు అందజేస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం విధితమే. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ రాష్ట్రంలో పాల ఉత్పత్తిని 1.5కోట్ల లీటర్లకు పెంచుతామని హామీ ఇచ్చింది. అంతేకాక.. ఆవులు, గేదెలను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చే పాడి రైతులకు రూ. 3 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. పాల సబ్సిడీని రూ. 5 నుంచి 7కు పెంచుతామని, ప్రతీ డివిజన్ లో నందిని డెయిరీ టెక్నాలజీ పాలిటెక్నిక్స్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది.