కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ప్రియాంక చతుర్వేది శుక్రవారం(ఏప్రిల్-19,2019)శివసేన పార్టీలో చేరారు.శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముంబైలో ఉద్దవ్ ఠాక్రేతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రియాంక మాట్లాడుతూ…శివసేనలో చేరడం చాలా సంతోషంగా ఉంది.శివసేన నన్ను ఓ కుటుంబసభ్యురాలిగా పార్టీలోకి తీసుకోవడం చాలా సంతోషం కలిగించింది.ఉద్దవ్ జి,ఆదిత్యజీలకు ధన్యవాదాలు అని ఆమె తెలిపారు.ఓ ముంబైకర్ గా ముంబైకి సేవ చేయాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. మహిళల సమస్యల గురించి ప్రశ్నించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని ఆమె తెలిపారు.మహిళల ఇష్యూస్ గురించి వాయిస్ వినిపించిన ప్రతిసారి తనను సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ గా ట్రోల్ చేశారని ఆమె అన్నారు.
ప్రియాంక పార్టీలో చేరిన సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ…ప్రియాంక గారిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆమె ఆత్మవిశ్వాసంతో తన పార్టీని కాపాడింది.శివసేన బెస్ట్ ఛాయిస్ అని ఆమె భావించింది.శివసేన కుటుంబంలోకి ఆమెను సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు.
గతంలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన నేతలకు పార్టీలో పెద్ద పీట వేస్తున్నారని, రౌడీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి,పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రియాంక ఆమె తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపిన విషయం తెలిసిందే.అయితే ఈ లోక్ సభ ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించకపోవడం కూడా ఆమె రాజీనామాకు ఓ కారణమై ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక రూపంలో పెద్ద షాక్ తగిలిందనే చెప్పవచ్చు.