స్కూల్ కు వెళ్లిన పిల్లోడికి హాజరు వేయటం కామన్.. ప్రెజంట్ మేడమ్, ప్రెజంట్ సార్ అనటం కూడా కామన్. ఇప్పుడు రూల్స్ మారాయా.. ప్రెజంట్ సార్, మేడమ్ కాదా.. అవును అనే అంటోంది గుజరాత్ సర్కార్. స్కూల్స్ లో పిల్లలకు హాజరు సమయంలో జై భారత్, జైహింద్ అంటూ పలకాలని కొత్త విధానం తీసుకొచ్చింది. ఈ మేరకు గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సర్కార్ వెర్షన్ ఇలా ఉంది :
పిల్లల్లో దేశ భక్తి పెంపొందించేందుకు ఈ విధానం తీసుకొచ్చామని సమర్ధించుకుంటోంది ప్రభుత్వం. చిన్నతనం నుంచి దేశభక్తి, దేశంపై ప్రేమ, ఈ దేశం నాది అనే భావన తీసుకొచ్చినట్లయితే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది అనేది ఓ వాదన. అంతే కాకుండా దేశంలో అల్లర్లు తగ్గిపోవటం, అసాంఘిక శక్తులకు చెక్ పెట్టటం ఈజీ అవుతుందనే ఆలోచన కూడా ఉంది. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తూనే.. దేశంలోని ప్రతి ఒక్కరూ మతాలు, కులాలకు అతీతంగా ఈ దేశ గడ్డపై పుట్టిన అందరూ పిల్లలు జైభారత్, జై హింద్ అనాల్సిందే అంటోంది.
మనస్సుల్లో ఉండాలి.. బలవంతం ఏంటీ :
స్కూల్ హాజరు సమయంలో జై భారత్, జై హింద్ అనటం మూర్ఖత్వం అంటున్నారు మరికొందరు. ఇలా అంటేనే దేశభక్తి ఉన్నట్లా అని ప్రశ్నిస్తున్నారు. మనసులో ఉండాలి కానీ.. మాటలో ఏముందీ అంటున్నారు. దేశాన్ని బీజేపీ రాజకీయాల కోసం వాడుకుంటుందని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. దేశంతో చెలగాటం ఆడుతుందని ఆరోపణలు కూడా చేస్తోంది.