మై డియర్ స్టూడెంట్స్.. ముందు మర్డర్ చేయండి.. తరువాత సంగతి చూసుకుందాం.. అంటూ ఓ వైస్ చాన్సలర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
లక్నో: మై డియర్ స్టూడెంట్స్.. ముందు మర్డర్ చేయండి.. తరువాత సంగతి చూసుకుందాం.. అంటూ ఓ వైస్ చాన్సలర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విద్యార్ధులకు ఆదర్శంగా ఉండాల్సిన వీసీ ఇటువంటి వ్యాఖ్యలు చేయటంపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ వీసీ రాజారాం యాదవ్.. ఈ నెల 29న ఘాజీపూర్ జిల్లా గాంధీపురంలోని సత్యదేవ్ కాలేజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్ధేశించి చేసిన ప్రసంగంలో వీసీ నోరు పారేసుకున్నారు.
మీరు పూర్వాంచల్ విద్యార్థులైతే..ఏడుస్తూ నా వద్దకు రాకండీ.. ఎటువంటి సందర్భంలోనైనా మీరు ఎవరితోనైనా గొడవకు దిగితే సదరు వ్యక్తిని బాగా కొట్టండి.. అంతగా కోపం తగ్గకపోతే.. అతన్ని చంపేసి మరి నా దగ్గరకు రండి.. ఆ తర్వాత వ్యవహారం మనం మనం చూసుకుందాం అంటూ వీసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో రాజకీయ నేతలతోపాటు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. రాజారాం యాదవ్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి అబ్దుల్ హఫీజ్ గాంధీ డిమాండ్ చేశారు.
వీసీ వ్యాఖ్యలను జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తీవ్రంగా ఖండించారు.బాధ్యత మరిచి వీసీ మాట్లాడుతున్న ఇలాంటి వ్యాఖ్యలు విద్యావ్యవస్థను భ్రష్ఠుపట్టిస్తాయన్నారు. ఘాజీపూర్‌లో జరిగిన అల్లర్లలో ఓ కానిస్టేబుల్‌ను రాళ్లతో కొట్టిచంపిన క్రమంలో వీసీ వ్యాఖ్యలు మరో వివాదానికి దారి తీశాయి. వర్శిటీలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి విద్యార్ధులను హింసలకు ప్రోత్సహించేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.