శివాజీతో మోడీని పోలుస్తూ పుస్తకం : నిషేధించాలంటూ నిరసనలు

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో ప్రధాని మోడీని పోలుస్తూ ప్రచురించిన ఓ పుస్తకంపై వివాదం నెలకొన్నది. పుస్తక ఆవిష్కరణ ఫొటోలు రచయిత ట్వీట్‌ చేయడంతో వివాదం చెలరేగింది.

  • Publish Date - January 14, 2020 / 02:01 AM IST

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో ప్రధాని మోడీని పోలుస్తూ ప్రచురించిన ఓ పుస్తకంపై వివాదం నెలకొన్నది. పుస్తక ఆవిష్కరణ ఫొటోలు రచయిత ట్వీట్‌ చేయడంతో వివాదం చెలరేగింది.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో ప్రధాని మోడీని పోలుస్తూ ప్రచురించిన ఓ పుస్తకంపై వివాదం నెలకొన్నది. బీజేపీ నేత జైభగవాన్‌ గోయల్‌ రాసిన ‘ఆజ్‌ కే శివాజీ: నరేంద్రమోదీ’ పుస్తకాన్ని ఢిల్లీలో బీజేపీ ఆఫీసులో ఆదివారం ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణ ఫొటోలు రచయిత ట్వీట్‌ చేయడంతో వివాదం చెలరేగింది. శివాజీతో మోడీని పోల్చడంపై శివసేన సీనియర్‌ నేత సంజయ్‌రౌత్‌ మండిపడ్డారు. సోమవారం (జనవరి 13, 2020) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ శివాజీని అవమానించడమేనని అన్నారు. ఈ పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

మోడీ.. వీర శివాజీ అంతటి గొప్ప వ్యక్తి అని బీజేపీ భావిస్తుందా? అని ప్రశ్నించారు. తాము మోడీని గౌరవిస్తామని, అయితే శివాజీ అంతగొప్ప వ్యక్తిని ఎవరితోనూ పోల్చడాన్ని అంగీకరించబోమన్నారు. శివాజీ వారసులైన బీజేపీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే, సతారా మాజీ ఎంపీ ఉదయన్‌రాజే భోసలే పేర్లు ఉటంకించకుండా.. వారికి ఆ త్మాభిమానం ఉంటే బీజేపీ నుంచి వైదొలగాలన్నారు. ఈ పుస్తకం సంగతి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ దృష్టికి తీసుకెళ్లానని రౌత్‌ చెప్పారు.

పుస్తకాన్ని నిషేధించాలంటూ నిరసనలు శివాజీతో ప్రధాని నరేంద్రమోడీని పోల్చుతూ ప్రచురించిన పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలంటూ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ), శివసేన, శంభాజీ బ్రిగేడ్‌ నేతలు, కార్యకర్తలు మహారాష్ట్రలోని పుణె, షోలాపూర్‌, ఔరంగాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ పుస్తకం ఉప సంహరణకు రచయిత అంగీకరించారని బీజేపీ సోమవారం తెలిపింది. ఈ పుస్తకంతో పార్టీకి సంబంధం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు.