భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే 1463 కేసులు నమోదు కాగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్‌డౌన్ విధించినప్పటిక కరోనా కేసులే వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో ఇప్పటికే కోవిడ్ బాధితుల సంఖ్య 10వేల మార్కు దాటి… 10వేల 815కి చేరింది. వీరిలో 9వేల 272 మంది చికిత్స పొందుతుండగా… 1190 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 353కి చేరింది. మన దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో నమోదవుతున్నాయి.
మహారాష్ట్ర అత్యధిక కేసులతో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. అక్కడ రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం మహారాష్ట్రలో 350 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 2వేల 684కి పెరిగింది. గత ఆరు రోజుల్లోనే మహారాష్ట్రలో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా సంబంధిత మరణాలు 178 నమోదు కాగా…259 మంది కోలుకున్నారు.
ముంబై నగరం కరోనాకు హాట్ స్పాట్‌గా మారింది. అక్కడ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ముంబైలో కొత్తగా 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. ఒక్క ముంబైలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,753కు చేరింది. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం మరో 11 మంది మరణించడంతో… అక్కడ కరోనా మృతుల సంఖ్య 111 కి చేరింది. మరోవైపు… కరోనా నుంచి కోలుకుని 23 మందిని డిశ్చార్జ్ అవడంతో… ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 154కి పెరిగింది. ఆసియాలోనే అతిపెద్ద మురికవాడగా చెప్పుకునే ముంబైలోని ధారావిలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. ధారావిలో ఇప్పటివరకు 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నిజాముద్దీన్ ఘటన అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కేవలం ఒక్కరోజే 356 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో ఢిల్లీలో కేసుల సంఖ్య 1510కి చేరింది. వీరిలో 28మంది మృత్యువాతపడ్డారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రజలను ఇళ్లనుంచి బయటకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1200 దాటింది. నిన్న ఆ రాష్ట్రంలో 31 కొత్త కేసులను గుర్తించారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య ఒకవెయ్యి ఐదుకి చేరింది. కరోనాతో బాధపడుతూ నిన్న ఒకరు మృతిచెందడంతో… మరణాల సంఖ్య 12కి చేరింది. దేశంలో రాష్ట్రాల వారీగా నమోదైన కేసుల సంఖ్యపరంగా మూడోస్థానంలో ఉన్న తమిళనాడులో ప్రస్తుతం 1111మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఒక్కరోజే వందకు పైగా కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7వందలకు చేరువైంది. నిన్న 102 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా… మొత్తం బాధితుల సంఖ్య 697కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 50 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. 8మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో యూపీలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 639గా ఉంది.
రాజస్థాన్‌లోనూ కరోనా కేసులు వెయ్యి దాటాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్ కేసులు 1005కి చేరాయి. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఒక్కరోజే 108 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర , ఢిల్లీ, తమిళనాడు తర్వాత పాజిటివ్ కేసులు వెయ్యి మార్కును దాటిన రాష్ట్రంగా నిలిచింది. ఇక ఈ మహమ్మారి కారణంగా రాజస్థాన్‌లో ఇప్పటివరకు 11 మంది మరణించారు.
రాజధాని జైపూర్ జిల్లాలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. కొత్త కేసుల్లో ఇక్కడే 83 నమోదయ్యాయి. మొత్తంగా… 453 కరోనా పాజిటివ్ కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. జోధ్‌పూర్‌లో 13, కోటలో 8, జలావర్‌లో 2, జైసల్మేర్, జున్‌జున్‌లలో ఒక్కో కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చాయి. బాధితుల్లో ఇటలీకి చెందిన ఇద్దరు, ఇరాన్ దేశానికి చెందిన 54 మంది ఉన్నారు.
జమ్మూకశ్మీర్ లో కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా బాధితులతో జమ్మూకశ్మీర్ లో కరోనా కేసుల సంఖ్య 278 కి చేరింది. మరోవైపు… కరోనా కట్టడి కోసం అక్కడ రెడ్ జోన్ల సంఖ్యను పెంచారు అధికారులు. తాజాగా జమ్ములో 14, కశ్మీర్‌లో 76 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. దీంతో రెడ్ జోన్ల సంఖ్య90కి చేరింది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు పోలీసులు, అధికారులు పకడ్బందీగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. అనుమానిత లక్షణాలున్న వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.