దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 15లక్షలు, మరణాలు 34వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం దాదాపు 50వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 513 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 15లక్షల 31వేల 669కు చేరింది. దేశంలో మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. నిత్యం దాదాపు 700 కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 768మంది కొవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 34వేల 193కు చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 9లక్షల 88వేల 029 మంది కోలుకున్నారు. 5లక్షల 09వేల 447 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.24శాతానికి చేరగా, మరణాల రేటు 2.25శాతంగా ఉంది.
12రోజుల్లోనే 5లక్షల కేసులు:
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో తొలి ఐదు లక్షల కేసులు నమోదు కావడానికి దాదాపు 148 రోజులు పట్టింది. ఆ తర్వాత మరో 20రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపై 10లక్షల మార్కును దాటింది. తాజాగా 10లక్షల కేసుల నుంచి 15లక్షల కేసులు నమోదుకావడానికి కేవలం 12రోజుల సమయం మాత్రమే పట్టింది. కాగా, అత్యధిక కేసులున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
1.77 కోట్ల నమూనాలను పరీక్షించాం: ఐసీఎంఆర్
జూలై 28 నాటికి దేశవ్యాప్తంగా కోటి 77లక్షల 43వేల 740 నమూనాలను పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒకేరోజు 4లక్షల 08వేల 855 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ప్రకటించింది.