కరోనా ముగిసింది.. దీదీ మాత్రం నటిస్తుంది.. లాక్‌డౌన్ పెడుతుంది

  • Publish Date - September 12, 2020 / 06:40 AM IST

కరోనాతో దేశం మొత్తం కకావికలం అయిపోతుంటే.. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాత్రం కరోనా వెళ్లిపోయింది అంటున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని కామెంట్ చేశారు. ‘పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్ అంతమైంది. సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇంకా కరోనా ఉందని నటిస్తున్నారు. కరోనా సాకుతో రాష్ట్రంలో నేటికీ లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. ఎన్నో నిబంధనలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.




బీజేపీ సమావేశాలు నిర్వహించకూడదనే ఉద్దేశంతోనే సీఎం మమత లాక్‌డౌన్ రూల్స్ అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే మమ్మల్ని ఎవరూ ఆపలేరు. మేం చేయాలనుకున్నది చేసి తీరేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ’ ధనియాఖాళీలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 9 న పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సామూహిక ర్యాలీలో పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా విమర్శలు చేశారు. మమతాపై తీవ్రమైన ఆరోపణలు చేసిన ఆయన, ‘హిందూ వ్యతిరేక మనస్తత్వంతో బెంగాల్‌లో పనులు జరుగుతున్నాయి’ అని అన్నారు. మమతా ఓటుబ్యాంక్ రాజకీయాల గురించి ప్రజలకు తెలియజేయాలని ఆయన బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 5వ తేదీన రామాలయ పనులు ప్రారంభం అయినప్పుడు మమతా లాక్‌డౌన్ పెట్టినట్లు చెప్పారు. మమతా బెనర్జీ కార్మికులు రేషన్‌ను దోచుకునే పనిలో నిమగ్నమైనప్పుడు, బిజెపి కార్యకర్తలు రేషన్ పంపిణీలో నిమగ్నమయ్యారు అని ఆయన అన్నారు.




https://10tv.in/hyderabad-kims-doctors-transplanted-two-lungs-in-a-corona-infected-patient-for-the-first-time-in-india/
ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్‌లో దాదాపు రెండు లక్షల కరోనా కేసులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో రోజుకు మూడు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. 41 మంది కరోనాతో చనిపోయారు. రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, పదుల సంఖ్యలో కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. అయితే బెంగాల్‌లో కరోనా వైరస్ లేదని, తమ పార్టీ మీటింగ్‌ పెట్టకూడదనే నిషేధం విధిస్తున్నారంటూ బీజేపీ నేత కామెంట్ చెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తుంది.