మహారాష్ట్ర వణికిపోతోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్ రావడంతో క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలోనే అత్యధిక కేసులు ఈ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అదుపులోకి రావడం లేదు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ముంబయి, పుణే నగరాల్లోనే అత్యధిక కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ముఖ్యంగా ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ ధారావిలో కేసులు నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. దేశ ఆర్థిక రాజధానిగా.. దేశంలోనే అతి పెద్ద నగరంగా ఉన్న ముంబై మహానగరంలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ ఒక్క నగరంలోనే వెయ్యికి దగ్గరగా కేసులు ఉన్నాయి. ముంబైలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రజలను బయటకు రానివ్వడం లేదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాల్సిందే. మాస్క్ ధరించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
అన్ని దేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువ సంఖ్యలో మహారాష్ట్రలో ఉంటారు. ముఖ్యంగా ముంబై, పుణె నగరాల్లో ఈ సంఖ్య ఎక్కువ. దీంతో అనుమానితులు కూడా చాలా మందే ఉన్నారు. కొందరిలో లక్షణాలు కూడా కనిపించడం లేదు. దీంతో వారందరినీ క్వారెంటైన్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ పరీక్షలు కూడా ఎక్కువ సంఖ్యలో నిర్వహిస్తున్నారు. అదే తీరుగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై, ఐటీతో పాటు ఇతర రంగాలకు హబ్‌గా పుణె నగరాలున్నాయి.
దీంతో ఇక్కడకు దేశ విదేశాల నుంచి వచ్చే వారు అధికం. విమానాల రాకపోకల నిలిపివేతకు ముందే ఇక్కడకు చాలా మంది చేరుకున్నారు. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులున్నాయి. దీంతో ఇక్కడ ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ బయటపడిన కేసుల్లో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చినవారివేనని చెబుతున్నారు.
ఇప్పుడిప్పుడే లోకల్‌గా కూడా వ్యాప్తి చెందుతోంది. 2 కోట్ల జనాభా ఉన్న ముంబై మహానగరంలో వ్యాప్తి తీవ్రంగా ఉంది. నగరంలో మురికివాడలకు కూడా వ్యాపిస్తోంది. ఇప్పటికే ధారావిలో కేసులు బయటపడ్డాయి. ఇది అక్కడ ప్రభుత్వ, అధికారయంత్రాంగాల్లో ఆందోళన కలిగిస్తోంది. క్వారంటైన్ చేయడంతో పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడం ఒక్కటే వ్యాప్తి నివారణకు మార్గమని అంటున్నారు.
బృహన్ ముంబై కార్పొరేషన్ కూడా రోజుకి 1500 టెస్టులు చేస్తోంది. ప్రతి వార్డ్‌ని, డివిజన్‌ని వదిలిపెట్టకుండా, లక్షణాలున్న ప్రతి ఒక్కరినీ పరీక్షిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న కేసులలో ఎక్కువ సౌదీ, యూఏఈ సహా ఇతర పాశ్చాత్యదేశాలకు వెళ్లివచ్చిన వారివేనని చెబుతున్నారు. వాటికి తోడు నిజాముద్దీన్ ఎపిసోడ్ పరిస్థితిని ఈ స్థాయికి తీసుకువచ్చిందని బీఎంసీ అభిప్రాయపడుతోంది. ముంబైకి పొంచి ఉన్న మరో ప్రమాదం ధారావి. ఇక్కడ కనుక ఒక్కరికి సోకితే కనీసం మరో ముప్పై మందికి ఆ వైరస్ అంటించి ఉండొచ్చనే అంచనాలే భయపెడుతున్నాయి.
బాంద్రా, ఈస్ట్ ముంబై ఏరియాల్లోనూ ఇలాంటి స్థితే నెలకొంది. అందుకే బయటకు ఎవరు వచ్చినా ముఖానికి మాస్క్ లేకుండా రావద్దనే హెచ్చరిక చేసింది బాంబే మున్సిపల్ కార్పొరేషన్. ఇదే సమయంలో స్థానిక ఫార్మా కంపెనీ ఇప్కా ల్యాబ్స్ పది కోట్ల హైడ్రో క్లోరోక్విన్ ట్యాబ్లెట్ల తయారీకీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ లేకుండా డాక్టర్లు, నర్సులు ట్రీట్మెంట్ చేయడం ప్రమాదమని, అందుకే వారికి కరోనా సోకుతోందంటూ స్థానికంగా ఉన్న కస్తూర్బా హాస్పిటల్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.