కరోనా దుష్ప్రభావాలు.. మనుషుల ఆయుర్దాయం ఎంత తగ్గుతుందో తెలుసా?

Corona: గుండెపోటు, క్యాన్సర్, వంశపారంపర్యవ్యాధులు, షుగర్ వంటివి..

Covid 19

కరోనా వల్ల జరిగిన కల్లోలం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా కోటీ 30లక్షల మందికిపైగా ప్రజల ప్రాణాలు తీసింది. కోట్లమందిని రోగాల పాలు చేసింది. ఉపాధికోల్పోయివారి సంఖ్య, వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుని నిలువనీడ కోల్పోయినవారి సంఖ్య లెక్కకు అందదు. ఒకటీరెండు సార్లు వైరస్ సోకి, తగ్గిపోవడంతో ఆగలేదు.

కరోనా దుష్ప్రభావాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా, వ్యాక్సిన్ల ప్రభావంతో ఇతర రోగాల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తంగా ఈ శతాబ్ది మహమ్మారి మనుషులను ఎంత నాశనం చేయాలో అంతా చేసింది. వీటన్నింటితో పాటు ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆయుర్దాయం కరోనా వల్ల పదేళ్లు తగ్గిపోయిందని తాజా అధ్యయనాల్లో తేలడం మరో విషాదం.

పదేళ్ల జీవిత ఆయుర్దాయం తగ్గి..
కేవలం రెండంటే రెండే ఏళ్లలో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంతో మనిషి పదేళ్ల జీవిత ఆయుర్దాయం తగ్గిపోయింది. 2019 నుంచి 2021 మధ్య మనిషి సగటు ఆయుర్దాయం అంచనా 71 ఏళ్లకు పడిపోయింది. 2012లో ఆయుర్దాయం ఇలాగే ఉండేది. అలాగే ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయసు కూడా 61 ఏళ్లకు తగ్గిపోయింది.

వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ తాజా జాబితాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసింది. ఇది 2012నాటి అంచనాలతో సమానం. అయితే ప్రపంచం మొత్తం కరోనాబారినపడ్డప్పటికీ మనిషి ఆయుర్దాయంపై వైరస్ ప్రభావం ఒక్కోచోట ఒక్కోలా కనిపిస్తోంది.

అమెరికా, ఈశాన్య ఆసియాలో మనిషి ఆయుర్దాయం 2019-2021 మధ్య మూడేళ్లు తగ్గితే…ఆరోగ్యకరమైన జీవితం సాగించే సమయం రెండున్నరేళ్లకు తగ్గింది. ఈ ప్రాంతంపైనే ప్రభావం ఎక్కువగా ఉంది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో మాత్రం వైరస్ వల్ల ఆయుర్దాయంపై కలిగిన ప్రభావం తక్కువగా ఉంది. ఆయుర్దాయం ఏడాదిలోపే తగ్గగా, ఆరోగ్యకరైన జీవనం తగ్గిన కాలం రెండేళ్ల కన్నా తక్కువ ఉంది.

కరోనాకు ముందు?
కరోనాకు ముందు ఆరోగ్యం పరంగా ప్రపంచం కాస్త పురోగతి సాధించింది. కోట్లమంది ప్రజలు మెరుగైన ఆరోగ్యం, వైద్య సేవలు, అత్యవసర చికిత్సలు పొందారు. కానీ కరోనా తర్వాత పరిస్థితి మారిపోయింది. కేవలం రెండేళ్లలో పదేళ్లు వెనక్కిపోయింది ప్రపంచం. ఈ పరిణామాలు గమనిస్తే…ప్రపంచ ఆరోగ్య భద్రతను బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్య రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం, దేశాలు సమన్వయంతో పనిచేయడం వంటివి జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.

కరోనా వల్లే ఎక్కువమంది చనిపోయారు. 2020లో ఎక్కువమంది చనిపోవడానికి మూడో కారణంగా కరోనా ఉండగా 2021లో రెండోస్థానంలో వైరస్ ఉంది. కోటీ 30లక్షలమందిని మహమ్మారి బలితీసుకుంది. 2020, 2021లో ఆఫ్రికా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో మరణాలకు ప్రధాన కారణం కరోనానే.

రెండేళ్లలో అమెరికాలో ఎక్కవమంది కరోనాకు బలైపోయారు. మహమ్మారికి ముందు గుండెపోటు, క్యాన్సర్, వంశపారంపర్యవ్యాధులు, షుగర్ వంటివి మరణాలకు ఎక్కువగా కారణంగా ఉండేవి. ఇవి ప్రాణాంతక రోగాలుగా ఉన్నాయి. 2019లో 79 శాతం మరణాలకు ఇవే కారణం. కరోనా సమయంలోనూ వైరస్ బారిన పడకుండా చనిపోయిన వారిలో 78 శాతం ఈ వ్యాధులతోనే మరణించారు.

ఊబకాయం
పోషకాహార లోపం, ఊబకాయం వంటి సమస్యలూ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి. 2022నాటికి ఐదు అంతకన్నా ఎక్కువ వయసున్నవాళ్లలో వందకోట్లమందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నారు. 50 కోట్లమంది కావాల్సిన బరువు కన్నా తక్కువ ఉన్నారు. ఐదేళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారుల్లో 14కోట్ల 80లక్షల మందికి పోషకాహారలోపం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలకు వైకల్యాలు, శరణార్థులు, వలసదారులు కారణమని WHO తెలిపింది. శరణార్థులకు, వలసదారులకు కావాల్సిన వైద్యం అందడం లేదు. తమ పౌరులతో పోలిస్తే… ప్రభుత్వ ఆరోగ్య సేవలను 84 దేశాలు మాత్రమే శరణార్థులకు కల్పిస్తున్నాయి. అయితే ఇన్ని లోపాలున్నప్పటికీ… ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకొచ్చాయి. కానీ మిగిలిన ఆరోగ్యసమస్యలతో పోలిస్తే.. కరోనా మనిషిని పీల్చిపిప్పిచేసింది.

Also Read: బాత్రూంలో 30 పాములు.. వణికిపోయిన స్థానికులు

ట్రెండింగ్ వార్తలు