ఢిల్లీలో మరోసారి కరోనా కలకలం… కొత్తగా 6,715 కేసులు

  • Publish Date - November 6, 2020 / 01:55 AM IST

Corona again in Delhi : ఢిల్లీలో మరోసారి కరోనా వైరస్‌ కలకలం రేపుతున్నది. మూడోసారి వైరస్‌ విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా సుమారు 7 వేల వరకు కరోనా కేసులు వెలుగు చూశాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,715 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి.



దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,16,653కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 6,769కు పెరిగింది. గత 24 గంటల్లో 5,289 మంది కోలుకున్నారు. దీంతో ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య 3,71,155కు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 38,729 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.



కరోనా విజృంభణపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా రాజధానిగా ఢిల్లీ మారుతుందని వ్యాఖ్యానించింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనా పరిస్థితిని గురువారం సమీక్షించారు. వరుస పండుగలు, గాలి కాలుష్యం కారణంగానే మరోసారి కరోనా కేసుల తీవ్రత పెరుగుతుందని చెప్పారు.