Vaccine
Corona vaccine for children : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ తన రూపాలను మార్చుకుంటూ దాడి చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయిందనుకున్న తరుణంలో థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొచ్చింది. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా పిల్లలు మినహా పెద్దలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు పిల్లలకు మాత్రం వ్యాక్సిన్ వేయలేదు. ఇకపై పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయనున్నారు.
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రకటించారు. పిల్లల వ్యాక్సిన్‌కు సంబంధించిన ట్రయల్స్ జరుగుతున్నాయని తెలిపారు. జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల ట్రయల్స్ ఫలితాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయని వెల్లడించారు.
అనంతరం వ్యాక్సిన్ వేయడం ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. పిల్లల కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్‌కు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని తెలిపారు. ట్రయల్స్ ఫలితాలు వచ్చే నెలలో వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ వేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.