ఢిల్లీ ఎయిమ్స్ లో మరో 13 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్

  • Publish Date - May 29, 2020 / 03:34 PM IST

భారత్ లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 13 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 206కు చేరింది. 

దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో అధిక కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రజలతోపాటు పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. మహారాష్ట్రలో కరోనాతో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. 

రాష్ట్రంలో ఒక్క రోజులోనే 116 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మహారాష్ట్రలో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 2 వేల 211 కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని పోలీస్ శాఖలో 25 మంది కరోనాతో మృతి చెందారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 2 వేల 190కేసులు నమోదయ్యాయి. 

మరోవైపు గత 24 గంటల్లో భారత్ లో 7 వేల 466 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తొలిసారి దేశంలో ఒకేరోజు ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. భారత్ లోని కరోనా కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 1.65 లక్షలకు చేరుకుంది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.