దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో చాలామంది రెండువారాలకు పైగా ఉన్నారు. వాళ్లకు కరోనా ఉందనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 18మంది సభకు హాజరైన వాళ్లే కావడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. అప్రమత్తమైన ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. పోలీసు, డాక్టర్ల బృందాలను రంగంలోకి దింపింది.
నిజాముద్దీన్ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. స్థానికుల్ని ప్రత్యేక బస్సుల్లో వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ప్రతి ఒక్కరికీ డాక్టర్లంతా కోవిడ్ 19 పరీక్షలు జరుపుతున్నారు. మరోవైపు శానిటైజేషన్ చర్యలు ముమ్మరం చేశారు. డ్రోన్ల ద్వారా రహదారులు, కాలనీల్లో స్ప్రే చల్లారు. ఆంక్షల్ని పట్టించుకోకుండా సామూహికంగా ప్రార్థనలు నిర్వహించారని ఇమామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎవర్ని, ఎప్పుడెప్పుడు కలిశారు..?
జమాత్ సదస్సు సామూహిక కార్యక్రమం.. వేలాది మంది హాజరయ్యారు. అది అయిపోయిన తర్వాత వాళ్లంతా స్వస్థలాలకు వెళ్లిపోయారు. వీళ్లంతా మార్గమధ్యలో ఎంతమందిని కలిశారు.. ఇంటికెళ్లాక ఎవరెవర్ని కలిశారనేది అంతుపట్టకుండా మారింది. ఇప్పుడిదే అధికారులకు సవాల్‌గా మారింది. మృతుల్లో, బాధితుల్లో చాలామంది సభకు హాజరైనవాళ్లే ఉన్నారు. వాళ్ల ద్వారానే ఇతరులకు వైరస్ పాకినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు వేగంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడం దడ పుట్టిస్తోంది. సదస్సుకి హాజరైన వారిలో ఇప్పటికే పదిమంది కరోనా బారినపడి చనిపోగా మూడు వందల మందికి పైగా పాజిటివ్ కేసులతో ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు.