Bangladesh Gifts India 10,000 Remdesivir Vials
Bangladesh Remdesivir Gift : కరోనావైరస్ మహమ్మారి విజృంభణతో అల్లాడిపోతున్న భారతదేశానికి సాయం చేసేందుకు బంగ్లాదేశ్ ముందుకు వచ్చింది. కరోనా చికిత్సలో అత్యవసరమైన రెమిడిసివిర్ ఇంజెక్షన్ సీసాలను 10వేల వరకు భారత ప్రభుత్వ ప్రతినిధికి అందించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితుల్లో చికిత్స కు ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ భారత సరిహద్దు ఓడరేవు పెట్రాపోల్ వద్ద అప్పగించారని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
COVID-19 మహమ్మారి సెకండ్ వేవ్ తో పోరాడటానికి భారతదేశానికి అవసరమైన మందులు, ఇతర అవసరమైన వస్తువులను ఢాకా అందిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటించింది. కొద్ది రోజులకే డ్రగ్ సరఫరా అందించింది. రెమ్‌డెసివిర్ మోతాదులను బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఔషధ సంస్థలలో ఒకటైన Beximco ఉత్పత్తి చేసింది. బంగ్లాదేశ్‌కు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అందించడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో భాగస్వామిగా ఉంది. ప్రధానమంత్రి షేక్ హసీనా సూచనల మేరకు ఈ రెమిడిసివిర్ ఇంజెక్షన్లను భారతదేశానికి పంపినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
కరోనాతో పోరాడుతున్న భారత్ కు బంగ్లాదేశ్ అందించిన వైద్య సాయంలో ఇదొకటి. అంతేకాదు.. బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో విటమిన్ సి, డి, జింక్ సప్లిమెంట్స్, ఎన్ 95
మాస్క్‌లు, కరోనా చికిత్స కోసం అవసరమయ్యే ముందులను కూడా పంపే అవకాశం ఉంది. COVID-19తో బంగ్లాదేశ్ కూడా పోరాడుతోంది. బంగ్లాదేశ్ లో గురువారం నాటికి 41 కరోనా మరణాలు నమోదయ్యాయి. బంగ్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని నివేదిక వెల్లడించింది.