Corona Dust Persist
Dr Randeep Guleria: భారత్‌లో కొవిడ్-19 కేసుల వ్యాప్తికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లుగా వెల్లడించారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభం అవ్వగా.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలను పాటించడం మానేశారని, ఇదే సమయంలో డబుల్ మ్యూటెంట్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పుకొచ్చారు.
కరోనా కేసులు పెరుగుతుండగా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పిన గులేరియా. కేసుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఆసుపత్రుల్లో పడకలు, మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచనలు చేశారు. దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఎన్నికలు జరుగుతుండడం కూడా ఒక కారణం అని అన్నారు.
మానవ జీవితాలు ముఖ్యమన్న విషయం ప్రజలు గుర్తించాలని, కొవిడ్ నిబంధనలు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఏ వ్యాక్సిన్ కూడా వైరస్ నుంచి వంద శాతం రక్షణ ఇవ్వదని, ఇవ్వలేదని.. వ్యాక్సిన్ ద్వారా యాంటీ బాడీలు పెరిగి వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయని చెప్పారు.