భారత్ లో కరోనా వైరస్(COVID-19)కేసులు 5వేల దాటిన సమయంలో ఇవాళ(ఏప్రిల్-8,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ..అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నాయకులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా నివారణ,లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భంగా విపక్ష నాయకులతో మోడీ చర్చించారు.
21రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ తర్వాత తొలిసారిగా పార్లమెంటరీ పక్ష నేతలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో భవిష్యత్ లో ఏ విధంగా ముందుకెళ్దాం అని విపక్ష నాయకులతో మోడీ చర్చించారు. కరోనా కట్టడిలో విపక్ష నాయకుల సలహాలను తీసుకున్నారు ప్రధాని. లాక్ డౌన్ పొడిగింపు అంశంపైన కూడా పార్టీల వారీగా మోడీకి వివరించారు ఫ్లోర్ లీడర్లు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ నుంచి లోక్ సభ ఎంపీ మిధున్ రెడ్డి,రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు,లోక్ సభ ఎంపీ నామా నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. కేంద్రమంత్రులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గులామ్ నబీ ఆజాద్,శివసేన నుంచి సంజయ్ రౌత్,ఎన్సీపీ నుంచి శరద్ పవార్,తృణముల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బందోపాధ్యాయ,సమాజ్ వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్,ఎస్ఏడీ నుంచి సుఖ్బీర్ సింగ్ బాదల్,బీఎస్పీ నుంచి ఎస్ సీ మిశ్రా,జేడీయూ నుంచి రంజన్ సింగ్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నవారిలో ఉన్నారు.
కాగా కరోనా విషయమై రెండు రోజుల క్రితం మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ,ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్,హెచ్ డీ దేవెగౌడ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా దేశంలోని పలువురు విపక్ష పార్టీల నాయకులతో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడిన విషయం తెలిసిందే.
భారత్ లో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 5వేల 194గా ఉండగా,149 మరణాలు నమోద్యయాయి. 402మంది కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ముఖ్యంగా మహారాష్ట్ర కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఒక్క మహారాష్ట్రలోనే కరోనా కేసుల సంఖ్య 1000 దాటింది. అయితే భారత్ లో నమోదైన కరోనా కేసుల్లో సగం గత నెలలో ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారివే.
Also Read | ఇక ఆన్ లైన్ లోనే ఆర్జిత సేవలు, ఇంటికే రాములోరి కళ్యాణ తలంబ్రాలు.. లాక్ డౌన్ వేళ భక్తులకు ప్రభుత్వం శుభవార్త