నాడు కంప్యూటర్లు వద్దన్న కామ్రేడ్స్…నేడు ఆన్ లైన్ లో పార్టీ మీటింగ్స్

చైనాలో పుట్టి…ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించి మహమ్మారిగా మారిన కరోనా వైరస్,ఆ తర్వాత లాక్ డౌన్ లు…ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది జీవితాల్లో పెద్ద మార్పులనే తీసుకొచ్చాయి. కరోనా కారణంగా కొంతమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడగా,మరికొందరి ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. అయితే ఈ కరోనా భారత్ లోని కమ్యూనిస్టుల ఆలోచనలో కూడా పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఒకప్పుడు కంప్యూటర్లను వ్యతిరేకించిన పాత కామ్రేడ్స్ నేడు అదే కంప్యూటర్ల ద్వారా వీడియో మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) యొక్క పాత కామ్రేడ్లు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఆకును తిప్పుతున్నట్లు కనిపిస్తోంది.

పార్టీ ఆవిర్భవించిన 1964నుంచి ఇప్పటివరకూ ఎన్నడూలేని విధంగా…కరోనా తెచ్చిన కష్టంతో బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా CPI(M)పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. పార్టీ జనరల్ సెక్రటరీ సీతారామ్ ఏచూరి…ల్యాప్ టాప్ ద్వారా ఇతర పార్టీ నాయకులతో కనెక్ట్ అయిన తన ఫొటోను ట్విటర్ లో షేర్ చేశారు. మామూలు కంటే చాలా భిన్నమైన పరిస్థితులలో మా పొలిట్ బ్యూరో మీటింగ్ జరిగింది అంటూ ఏచూరి ట్వీట్ లో తెలిపారు. అయితే, కమ్యూనికేషన్ కొరకు హైటెక్ యాప్స్,డిజిటల్ వరల్డ్ లోకి CPI(M) పార్టీ ఒక్కటే ఇప్పుడు ప్రత్యేకంగా అడుగుపెట్టలేదు. అనేక పార్టీలు తమ పార్టీ మీటింగ్ లకు ఇప్పడు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నాయి. ఇటీవల ఏపీలోని తెలుగుదేశం కూడా ఏటా నిర్వహించే అతిపెద్ద పార్టీ కార్యక్రమం “మహానాడు”ను ఆన్ లైన్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ CPI(M)గురించి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించవలసి వచ్చిందంటే…ఒకప్పుడు ఆఫీసుల్లో కంప్యూటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన CPI(M)పార్టీలో ఈ వీడియో మీటింగ్ ఓ చరిత్ర అని చెప్పవచ్చు.

1970ల దశకంలో బ్యాంకుల్లో కంప్యూటర్లు,అప్ గ్రేడ్ టెక్నాలజీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన ఎంప్లాయి యూనియన్స్ కు CPI(M)పార్టీ మద్దుతు ప్రకటించి,వారితో పాటు ఆందోళనల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. టెక్నాలజీ రాకతో మనుషుల అవసరం తగ్గిపోతుందని,తద్వారా మనుషులు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని,ఎంప్లాయిమెంట్ తగ్గిపోతుందన్న భయంతో ఆందోళనలు చేస్తున్నవారితో కామ్రేడ్స్ కూడా చేతులు కలిపి…కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని ఓ టూల్ గా చేసుకున్నారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కామ్రెడ్స్..ఉద్యోగుల రక్షణ అంటూ ఉద్యమించారు.

చాలా ఏళ్ల తర్వాత..2004లో అప్పటి వెస్ట్ బెంగాల్ సీఎం బుడ్డాదేభ్ భట్టాఛర్జీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…లెఫ్టిస్టులు నేతృత్వం వహించిన “కంప్యూటర్ వ్యతిరేక”ఆందోళనలను ఒక మూర్ఖపు లేదా ఫూలిష్ చర్యగా అభివర్ణించారు. బ్యాంకుల్లో,ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో కంప్యూటర్లు రాకను వారి ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు వ్యతిరేకిస్తే…మేము ఆ ఆందోళనలకు మద్దతిచ్చాము. కానీ మోడ్రన్ టెక్నాలజీని మనం ఎలా ఆపగలం? పరిశ్రమలు టాలెంట్ ఆధారంగా ఉండే శతాబ్దాలంలోకి మనం ప్రవేశించాం అని ఇప్పుడు వాళ్లకు అర్థమైంది అని భట్టాఛర్జీ వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే CPI(M)పార్టీ తమ ఇమేజ్ ని మార్చి..బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండేందుకు ప్రయత్నించింది. అయితే బెంగాల్ లో పరిస్థితులు మారిపోయి కమ్యూనిస్టులకు గుడ్ బై చెప్పేశారు బెంగాళీలు. 34ఏళ్లపాటు కమ్యూనిస్ట్ కంచుకోటగా ఉన్న బెంగాల్…2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.

అయితే,ఇప్పుడు కరోనా నేపథ్యంలో భారత్ లో లాక్ డౌన్ కొనసాగుతుంది. జూన్-30వరకూ లాక్ డౌన్ లేదా అన్ లాక్ 1 కొనసాగుతుందని ఇటీవల కేంద్రహోంశాఖ గైడ్ లైన్స్ ను విడుదల చేసిన నేపథ్యంలో…కామ్రేడ్ కొత్త ఆలోచనలతో పార్టీ సమయాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గురువారం, ఫేస్‌బుక్ ద్వారా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సీతారాం ఏచూరి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఏది ఏమైనప్పటికీ, కొత్త కమ్యూనికేషన్ మాధ్యమం ఉన్నప్పటికీ….పేదలకు ఆహార ధాన్యాలు,తక్షణ నగదు బదిలీ కోసం డిమాండ్ చేస్తూ జూన్ 16 న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో….పార్టీ డిమాండ్లు పాత సంస్కృతిని ప్రతిబింబించాయి.