Coronavirus Cases Today: భారత్‌లో కరోనా విశ్వరూపం.. ఒక్కరోజే భారీగా పెరిగిన కేసులు

దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి వేగం అదుపు లేకుండా పోతుంది. దీనితో పాటు, కరోనా ప్రమాదకరమైన వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

India Corona

Coronavirus Cases Today: దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి వేగం అదుపు లేకుండా పోతుంది. దీనితో పాటు, కరోనా ప్రమాదకరమైన వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రెండు లక్షల 47 వేల 417 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 380 మంది మరణించారు.

ఇప్పటివరకు 5488 ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11శాతంగా ఉంది. పెద్ద విషయం ఏమిటంటే దేశంలో నిన్నటితో పోలిస్తే 52 వేల 697 కేసులు ఇవాళ పెరిగాయి. నిన్న లక్షా 94వేల 720 కేసులు నమోదయ్యాయి. అంటే నిన్నటి మీద 27శాతం కేసులు పెరిగాయి.

యాక్టివ్ కేసులు 11 లక్షల 17 వేల 531కి పెరిగాయి
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఇప్పుడు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11 లక్షల 17 వేల 531కి పెరిగింది. అదే సమయంలో, ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4 లక్షల 85 వేల 35కి చేరుకుంది. గడిచిన గంటల్లో 84 వేల 825 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3 కోట్ల 47 లక్షల 15 వేల 361 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో 5వేల 488 ఓమిక్రాన్ కేసులు:
దేశంలో ఇప్పటివరకు 5 వేల 488 మందికి ఓమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదు కాగా.., 2వేల 162 మంది కోలుకున్నారు. దేశంలో ఈ వేరియంట్ బారిన పడిన రాష్ట్రాల సంఖ్య 27కి పెరిగింది. మహారాష్ట్ర, రాజధాని ఢిల్లీలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కొత్తగా 46వేల 723 కేసులు నమోదు కాగా.. 32 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో కొత్తగా 27,561 కేసులు నమోదు కాగా, 40 మరణాలు సంభవించాయి. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 22,155 కేసులు నమోదు కాగా.. 23 మరణాలు సంభవించాయి. కర్ణాటకలో కొత్తగా 21,390 కేసులు నమోదు కాగా.. 10 మంది మృతిచెందారు.

తమిళనాడు లో కొత్తగా 17,934 కేసులు నమోదు కాగా.. 19మంది చనిపోయారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్తగా 13,681 కేసులు నమోదు కాగా.. కేరళలో కొత్తగా 12,472కేసులు.. గుజరాత్‌లో 9వేల 941కేసులు నమోదయ్యాయి.