ఎన్కటి కాలం వచ్చేసిందా ? ఊరికి పోదామంటే..కాలి నడకన వెళ్లేవారు. ప్రస్తుతం అదే సీన్ ఇప్పుడు కనబడుతోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లడానికి వలస కూలీలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒక్క వలస కూలీలనే కాదు..చాలా మంది గోస పడుతున్నారు. మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన కరోనా ఎఫెక్ట్ చాలా మందిపై ప్రభావం చూపెడుతోంది.
లాక్ డౌన్ ప్రకటించడంతో..రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. బతుకుదెరువు కోసం వచ్చిన వారు పని లేక తల్లడిల్లిపోతున్నారు. సొంత ఊరికి వెళుదామంటే..బస్సులు, ఆటోలు, లారీలు, ఇతరత్రా ఏవీ లేకపోవడంతో కాలికి పని చెబుతున్నారు. వందల కిలో మీటర్లు నడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఒక్కరి ఒక్కరి బాధ విన్నా..చూస్తుంటే గుండెలు తరుక్కమానదు.
ఆధునిక రవాణా సౌకర్యాలు లేని ఎన్కటి కాలంలో ఎంతటి దూరమైనా కాలి నడకనే వెళ్లేవారు. ఇప్పుడు కరోనా రాకాసి వెంటబడుతుంటే..మూట…ముల్లె భుజాన వేసుకుని బతుకుజీవుడా అంటూ వెళ్లిపోతున్నారు. దేశంలోనే కాకుండా..తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు కనబడుతున్నాయి. కానీ..ఎక్కడివారక్కడే ఉండాలని..ప్రభుత్వాలు చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. సొంతూళ్లకు వెళ్లి తమ వారి దగ్గర ఉండాలనే కాంక్ష వారిలో బలంగా కనిపిస్తోంది. దీంతో వారు కాలినడకనే ఎంచుకుంటున్నారు.