భారత్ లో జూన్-జులైలో కరోనా విశ్వరూపం..ఎయిమ్స్ డైరక్టర్ కీలక వ్యాఖ్యలు

భారతదేశంలో జూన్-జులైలో కరోనా విజృంభణ ఉండే అవకాశముంది ఢిల్లీ ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా అంచనావేశారు. దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఆయన కీలక హెచ్చరిక చేశారు. జూన్, జూలై నెల్లలో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రెడ్ జోన్స్, కరోనా హాట్‌‌స్పాట్స్, కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

భారత్‌లో కరోనా కేసుల పెరుగుదల రేటు నిలకడగా ఉందని, కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయన్నారు. అయితే…దేశంలో కరోనా ఎప్పుడు తీవ్రరూపం దాల్చుతుందో కచ్చితంగా చెప్పలేమని కానీ ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ఆధారంగా జూన్, జూలై నెలల్లో కరోనా మరింత ప్రభావం చూపే అవకాశముందని గుల్జేరియా తెలిపారు.

భారత్‌లో పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరగడానికి టెస్ట్‌ల సంఖ్య పెరగడమే కారణంగా ఆయన చెప్పుకొచ్చారు. కరోనా ప్రభావిత దేశాలైన చైనా, ఇటలీలో కూడా లాక్‌డౌన్, భౌతిక దూరం పాటించడం వల్ల నెల తర్వాత ఫలితాలు కనిపించాయని గులేరియా చెప్పారు. కాగా, దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952కు చేరింది. మరణాల సంఖ్య 1,783కు చేరింది. 15,226మంది కోలుకున్నారు.

భారత్‌లో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 35,902. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 16,758కేసులు,651మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యధికంగా 6,625కేసులు నమోదుకాగా,396మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మూడవస్థానంలో ఢిల్లీ నిలిచింది. ఢిల్లీలో 5,532కేసులు 65మరణాలు నమోదయ్యాయి.

Also Read | ముంబైలో వెయ్యి బెడ్లతో కొవిడ్ ఆసుపత్రి నిర్మాణం, 20 రోజుల్లో అందుబాటులోకి