కరోనా వ్యాక్సిన్‌ వస్తే తొలుత వైద్య సిబ్బందితో పాటు వైరస్‌ ముప్పున్న ప్రజలకు

  • Publish Date - July 1, 2020 / 01:27 AM IST

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందితో పాటు వైరస్‌ ముప్పు ఉన్న ప్రజలకు తొలుత టీకాను ఇవ్వాలని ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం (జూన్ 30, 2020) నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత దాని అందుబాటును పరిగణనలోకి తీసుకుని సరఫరాకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టడంపై చర్చించారు. వైద్య సరఫరా వ్యవస్థల నిర్వహణ, వైరస్‌ ముప్పు ఉన్న వారికి ప్రాధాన్యత, వివిధ ఏజెన్సీలు..ప్రైవేట్‌ రంగం, పౌరసమాజం మధ్య సమన్వయం వంటి నాలుగు సూత్రాల అధారంగా వ్యాక్సిన్‌ పంపిణీపై నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు.

వ్యాక్సినేషన్‌ కోసం సార్వజనీనంగా, అందుబాటు ధరలో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో చర్చ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్‌ తయారీ, ఉత్పత్తి సామర్ధ్యాలపై రియల్‌ టైం పర్యవేక్షణ ఉండాలని నిర్ణయించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ కనుగొనే పనిలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ దేశాల్లో వ్యాక్సిన్‌ ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. ఇక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది అక్టోబర్‌ మాసం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

భారత్‌లో కరోనా వైరస్‌ ఉధృతి వేగంగా కొనసాగుతోంది. కొద్ది రోజులగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,522 కొత్త కరోనా కేసులు, 418 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 5,66,840 మందికి కరోనా సోకింది. కరోనాతో 16,893 మంది మృతి చెందారు. మంగళవారం (జూన్ 30, 2020) నాటికి 3,34,822 మంది కరోనాతో పోరాడి కోలుకొని, డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,15, 125 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. సోమవారం 5 వేల కేసులు నమోదవ్వగా మొత్తం కేసుల సంఖ్య 1,69,883కు చేరింది. ఢిల్లీలో 2,084 కరోనా కేసులు నమోదవ్వగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 85,000లకు చేరింది.