భారత్ లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉందని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల్లడించిన విషయం తెలిసిందే
భారత్‌లో అభివృద్ధి చెందుతున్న మూడు కరోనా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా, వాటిలో ఒక వ్యాక్సిన్ ఒకట్రెండు రోజుల్లో మూడవ దశ పరీక్షలకు చేరుకుంటుందని మంగళవారం నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. అయితే ఇది ఏ వ్యాక్సిన్ అన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. కానీ ఎక్కువ మంది ఇది ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటికి చెందిన వ్యాక్సిన్ అని భావిస్తున్నారు. భారత్ లో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నివహిస్తున్న విషయం తెలిసిందే.
ఇక,మిగిలిన రెండు దేశీయ వ్యాక్సిన్లు మొదటి,రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నట్లు వీకే పాల్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రజలకు ఇచ్చిన భరోసాకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయని వీకే పాల్ చెప్పారు. కాగా, భారత్ బయోటెక్, జైడస్ క్యాడిల్లా, సీరం ఇనిస్టిట్యూట్‌లు కరోనా వైరస్ నిరోధానికి దేశీ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో తలమునకలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ తయారీ పనులో అగ్రశ్రేణి ఫార్మా సంస్థలు అన్నీ తలమునకలై ఉన్నాయి.
ఒక్క వ్యాక్సిన్ సక్సెస్ అయినా కూడా ప్రపంచ దేశాలు అన్నీ అటువైపు క్యూకట్టడానికి రెడీ అయ్యాయి. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ సిద్ధం అయిందని ప్రకటించటమే కాదు..ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. అయితే పలు దేశాలు రష్యా వ్యాక్సిన్ కు సంబంధించిన డేటాను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాయి. రష్యా వ్యాక్సిన్ ఎంత సురక్షితం అయింది అనే అంశం తేలిన తర్వాతే పలు దేశాలు దీని విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనా కూడా ఓ వ్యాక్సిన్ కు సంబంధించి ఏకంగా పేటెంట్ హక్కులను కూడా పొందినట్లు వార్తలు వచ్చాయి.