ఓం నమశ్శివాయ : 111 అడుగుల ఎత్తైన మహా శివలింగానికి తొలిపూజ

  • Publish Date - November 12, 2019 / 04:07 AM IST

కార్తీక మాసం సందర్భంగా ఓం నమశ్శివాయ.. అంటూ శివనామస్మరణతో శివాలయాలన్నీ మారు మ్రోగుతున్నాయి. కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సందర్భంగా తిరువనంతపురంలోని చెంకల్‌ పంచాయతీలో ప్రతిష్ఠించిన మహా శివలింగానికి కార్తీక సోమవారం నాడు (నవంబర్ 11)న తొలి పూజను నిర్వహించారు. 

భారతదేశంలోనే అత్యంత  ఎత్తైన ఈ మహాశివలంగం ఎత్తు 111 అడుగులు. తిరువనంతపురంలోని చెంకల్‌ పంచాయతీలో మహేశ్వర శ్రీ శివపార్వతీ దేవాలయంలో ఆలయ మఠాధిపతి మహేశ్వరానంద స్వామి సోమవారం ఈ మహా శివలింగానికి  తొలిపూజ చేశారు.

దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టితో మహా శివలింగం నిర్మాణంలో ఉపయోగించారు. ఎనిమిది అంతస్తుల ఎత్తున ఈ శివలింగంలో ధ్యాన సాధన కోసం మందిరాలను కూడా ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో 108 శివలింగాలను, ఎనిమిదో అంతస్తులో కైలాస ప్రతిరూపాన్ని నెలకొల్పారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఈ భారీ శివలింగం చోటు దక్కించుకుంది.