Covaxin-Covishield Vaccines : కొవిడ్ వేరియంట్లపై కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయి : ICMR

కరోనా వేరియంట్లపై కొవాగ్జిన్, కొవిషిల్డ్ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ (డిజి) డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని చెప్పారు.

Covaxin-Covishield Vaccines : కరోనా వేరియంట్లపై కొవాగ్జిన్, కొవిషిల్డ్ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ (డిజి) డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై ఈ రెండు వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. గర్భిణీ మహిళలకు కూడా వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే ప్రతిఒక్కరూ తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే డెల్టా ప్లస్ 12 దేశాలలో కనిపించిందని చెబుతున్నారు.

భారతదేశంలో 48 కేసులను గుర్తించినట్టు డాక్టర్ బలరామ్ అన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్‌పై టీకా ప్రభావాన్ని తనిఖీ చేసే ల్యాబరేటరీ ట్రయల్ ఫలితాలు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రావాలన్నారు. ప్రస్తుతానికి పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే దేశం ఒక్కటే ఉందని చెప్పారు.

చాలా చిన్న పిల్లలకు టీకా అవసరమా అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉందని తెలిపారు. పిల్లలకు టీకాలు వేయడంపై ఎక్కువ డేటా ఉందని చెప్పారు. పిల్లలకు పెద్ద సంఖ్యలో టీకాలు వేసే స్థితిలో లేమని అన్నారు. భారత్‌లో 2ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలపై అధ్యయనాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.

సెప్టెంబర్ వరకు చిన్నారులకు వ్యాక్సినేషన్‌పై ఫలితాలు వస్తాయన్నారు. దీనిపై అంతర్గత చర్చ ముగియలేదని, పిల్లలకు టీకాలు వేయాల్సిన అవసరం ఉందా అన్న చర్చ కొనసాగుతుందని అన్నారు. చిన్నారులకు వ్యాక్సినేషన్‌పై అమెరికాలో కొన్ని సమస్యలను చూశామని బలరామ్ భార్గవ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు