Covaxin
Covaxin కరోనావైరస్ కట్టడికోసం దేశీయంగా అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” వ్యాక్సిన్ టీకా సురక్షితమైందని ‘ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ జర్నల్ తెలిపింది. కొవాగ్జిన్..సురక్షితమైనదని, వ్యాధినిరోధకతను పెంచుతోందని, ఎలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని లాన్సెట్ తేల్చింది. కొవాగ్జిన్ టీకాపై రెండో దశ పరీక్షలకు సంబంధించిన మధ్యంతర ఫలితాలను ఈమేరకు వెల్లడించింది.
అయితే ఈ అధ్యయనంలో వ్యాక్సిన్ సమర్థతను అంచనా వేయలేదని..దీని కోసం మూడో దశ ఫలితాలు అవసరమని లాన్సెట్ తెలిపింది. ఇక, ఫేజ్ 1తో పోలిస్తే ఫేజ్ 2 ట్రయల్స్‌లో వ్యాక్సిన్ మరింత మెరుగైందని లాన్సెట్ స్పష్టం చేసింది. సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఫిర్యాదు చేసిన వారి సంఖ్య కూడా ఫేజ్ 1తో పోలిస్తే ఫేజ్ 2లో తగ్గిందని తెలిపింది. ఈ అధ్యయనం 12-18 ఏళ్ల వయసులు, 55-65 ఏళ్ల వయసు వారిపై జరిగిందని, పిల్లల్లో, 65 ఏళ్లు పైబడిన వారిపై ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి మరింత అధ్యయనం అవసరమని లాన్సెట్ తెలిపింది. ఇదో గుడ్ న్యూస్ అని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లోని ఇన్ఫెక్షస్ డిసీజెస్ చీఫ్ ఫహీమ్ యూనస్ ఓ ట్వీట్ చేశారు.
భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్), నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్(ఎన్ఐవీ)తో కలిసి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేసింది. మూడో దశ ట్రయల్స్ ముగియకుండానే ఈ ఏడాది జనవరిలో దేశంలో కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీజీసీఏ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన తొలి డోసుగా కొవాగ్జిన్ టీకానే తీసుకున్నారు. మూడో దశ ట్రయిల్స్ లో కొవాగ్జిన్ టీకా 81శాతం సమర్థంగా పనిచేస్తోందని తేలిందనిగత వారం భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, జింబాంబ్వేలో కూడా కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అక్కడి ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది.