కరోనా భూతం : ఇండియా 2069 కేసులు..53 మంది మృతి

  • Publish Date - April 3, 2020 / 02:10 AM IST

ఇండియాలోనూ కరోనా మహమ్మారి రెక్కలుచాచింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం కేసులు 293కి చేరాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 141 కేసులు నమోదయ్యాయి. మొత్తం 293 కేసుల్లో…182 మంది ఢిల్లీ జమాత్‌కు చెందిన వారే కావడం ఆందోళన కల్గిస్తోంది. 

ఢిల్లీ జమాత్ మర్కజ్ కారణంగా తమిళనాడులో కోవిడ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. తమిళనాట మొత్తం కరోనా కేసుల సంఖ్య 309కి చేరింది. దీంతో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా తమిళనాడు  నిలిచింది. ఇప్పటి వరకూ కోవిడ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైన రెండో రాష్ట్రంగా కేరళ ఉండగా ఆ స్థానాన్ని తమిళనాడు ఆక్రమించింది. గురువారం ఒక్కరోజే ఈ రాష్ట్రంలో 75 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా..ఇందులో 74 కేసులు ఢిల్లీ జమాత్‌కు సంబంధించినవే.

మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం కొత్తగా 81 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 416కు చేరింది. ఆసియాలో కెల్లా అతిపెద్ద  మురికివాడ అయిన ధారవిలో ఒకరు కరోనా వల్ల మరణించగా..మరొకరికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా చాపకింది నీరులా విస్తరిస్తోంది. గురువారం నమోదైన కేసుల్లో 57 కేసులు ముంబైలోనే నమోదైయ్యాయి. రాష్ట్రంలో ఇద్దరు ప్రాణాలు కొల్పోగా.. మొత్తం 19 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

ప్రధాని మోదీ 2020, మార్చి 03వ తేదీ శుక్రవారం మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. ఉదయం 9గంటలకు వీడియో సందేశం ఇవ్వనున్నారు.  లాక్‌డౌన్‌ 10 రోజులు అయిన సందర్భంగా ప్రజలకు వీడియో మెసేజ్‌ ఇవ్వబోతున్నారు. నిన్న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ప్రధాని.. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా నిర్వహించడంపై పలు సూచనలు చేశారు. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. దీంతో ప్రధాని ఏం సందేశం ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. లాక్‌ డౌన్ గురించి కీలక ప్రకటన చేస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. లాక్ డౌన్ ఈనెల 14 వరకే ఉంటుందా? లేకపోతే పొడిగిస్తారా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన కేంద్రం…మరో ముందడుగు వేసి అధికారికంగా ఓ యాప్‌ను విడుదల చేసింది. ఆరోగ్య సేతు కోవిద్-19 ట్రాకర్ యాప్‌ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఆరోగ్య సేతు కోవిద్-19 ట్రాకర్ యాప్‌ను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్‌ను రూపొందించింది. కోవిద్-19 ట్రాకర్ యాప్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్‌తో పాటు 11 భాషలకు సపోర్టు చేస్తోంది.