covid-19
Covid-19 variant N440K spreading: భారత్‌కు ఇంకా కరోనా ముప్పు పొంచి ఉందా? దేశంలో కొత్త రకం కరోనా వెలుగుచూసిందా? దాని వల్ల ఇబ్బందులు తప్పవా? సీసీఎంబీ(ccmb) అధ్యయనంలో కొంత ఆందోళన కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. మన దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్440కె(N440K) అనే కొత్త రకం కొవిడ్-19 వైరస్ వ్యాప్తిలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ రకం వైరస్ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు అధ్యయనంలో తెలిసింది. కాగా, అది ప్రమాదకరమో కాదో స్పష్టత లేకున్నా, వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
దేశంలో తొలి కరోనా కేసు నమోదై ఏడాది దాటింది. ఈ క్రమంలో వైరస్ జన్యుక్రమ విశ్లేషణ ద్వారా వ్యాప్తిలో ఉన్న రకాలపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సీసీఎంబీ సహా వేర్వేరు సంస్థలు చేపట్టిన కొవిడ్ వైరస్ 6400 జన్యుక్రమ విశ్లేషణలో 5వేల ఉత్పరివర్తనాలు(variants) గుర్తించారు. ప్రధానంగా కొన్ని రకాలే ఎక్కువ వ్యాప్తిలో ఉన్నట్లు తేల్చారు. ఏ3ఐ జూన్ 2020 వరకు వ్యాప్తిలో ఉండగా.. తర్వాత ఏ2ఏ విస్తరించింది.
ఇందులోని డీ614జీ ఉత్పరివర్తనంతో ఎక్కువ విస్తరణకు కారణమైంది. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే ఎక్కువగా కనిపించింది. ఇటీవల చాలా దేశాల్లో కొత్తరకం కొవిడ్-19 వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో ఉత్పరివర్తనాలతో కొత్త రకం వ్యాప్తిలోకి వచ్చింది. మానవ శరీర కణాలకు అతుక్కుపోయే గుణంతో అధిక ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్నట్లు తేలింది.
యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్న కొత్త వైరస్ మన దేశంలోనూ వ్యాప్తిలో ఉందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలిపారు. రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుని వ్యాప్తికి కారణమవుతున్న ఈ484కె(E484K), అధిక వ్యాప్తికి కారణమవుతున్న ఎన్501వై(N501Y) ఉత్పరివర్తనాలు వీటిలో ఉన్నాయి. భారత్‌లో వీటి ఉనికి ప్రస్తుతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పాజిటివ్‌ల నుంచి సేకరించిన వైరస్ నమూనాలను తక్కువగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తుండటం ఇందుకు కారణం కావొచ్చని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా అన్నారు.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు:
దేశంలో కొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోది. ఇటీవల కొవిడ్ కేసులు ఎక్కువవుతున్నాయి. 22 రోజుల తర్వాత కొత్త కేసులు మళ్లీ దాదాపు 14వేలకు చేరాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 75శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 13వేల 993 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387కి చేరింది.
పెరుగుతున్న కేసులు, తగ్గుతున్న రికవరీలు:
ఇదే సమయంలో కొత్త కేసుల కంటే రికవరీలు తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 10వేల 307 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,06,78,048కి చేరింది. రికవరీ రేటు 97.27శాతంగా ఉంది. ఎప్పటిలాగే యాక్టివ్ కేసులు 2శాతానికి దిగువనే ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,127 యాక్టివ్ కేసులున్నాయి(1.30శాతం). గడిచిన 24 గంటల్లో మరో 101 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,56,212కు పెరిగింది.