N95 or KN95 masks: మామూలు మాస్క్‌తో కరోనా ఆగదు..

Covid airborne:కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కేసులకు కారణం ప్రజలు బయట విచ్చలవిడిగా మాస్క్‌లు లేకుండా తిరగడమే అని అంటున్నారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్‌లో బయటపడ్డ మరో విషయం.. గాలిలో కూడా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ మాస్క్ ధరిస్తే.. వైరస్ నుంచి తప్పించుకునే పరిస్థితి లేదని అంటున్నారు డాక్టర్లు.

కరోనా వైరస్ ప్రభావం గట్టిగా ఉందని, సాధారణ మాస్క్ వైరస్‌ను నివారించలేదని, N95, KN95 మాస్కులు మాత్రమే వైరస్ సోకకుండా అడ్డుకోగలవని అంటున్నారు. ఒక్క మాస్క్‌ను రోజుల తరబడి ఉపయోగిస్తే.. ఎలాంటి ఉపయోగం ఉండదని, రోజు విడిచి రోజు మాస్క్‌ కచ్చితంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ N95, KN95 మాస్కులు రెండు ఉపయోగించాలని డాక్టర్లు చెబుతున్నారు. గుడ్డ మాస్క్‌లతో ప్రయోజనం లేదని అభిప్రాయపడుతున్నారు. 24 గంటల పాటు ఒక N95 మాస్క్ ఉపయోగించిన తర్వాత…దాన్ని ఓ కవర్‌లో భద్రపరచాలని సూచించారు. రెండోరోజు రెండో మాస్కు పెట్టుకోవాలని తెలిపారు. మరుసటి రోజు..మొదటి మాస్క్‌ను ధరించాలని, ఇలా రోజు విడిచి రోజు N95, KN95 మాస్కులు మార్చి, మార్చి ఉపయోగించాలని వైద్యులు వివరించారు. ఈ మాస్కులను ఇలా ఎన్నిరోజులైనా పెట్టుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు.

ఒకరి నుంచి ఒకరికి కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందన్న సమాచారం ప్రజలందరిలో భయం కలిగించింది. అయితే దీని గురించి మరీ అంత కంగారు పడాల్సిన పనిలేదని మిచిగాన్ యూనివర్శిటీ డాక్టర్లు చెబుతున్నారు. మూసివేసి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కరోనా రోగులు వదిలిన గాలి నుంచి వచ్చిన వైరస్ నిలిచి ఉంటుందని, బహిరంగ ప్రదేశాల్లోని గాలితో అలాంటి ముప్పు ఉండదని స్పష్టంచేశారు. పార్క్‌లు, బీచ్‌ల్లో భౌతిక దూరం పాటిస్తూ హాయిగా తిరగవచ్చని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు