Covid Deaths Genocide: ఆక్సిజన్ కొరతతో కొవిడ్ మరణాలు.. ఇదో నేరపూరిత చర్య.. మారణహోమం కంటే తక్కువ కాదు

ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ -19 బాధితులు మరణిస్తున్నారనే వార్తలను ధృవీకరించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో, మీరట్ జిల్లా న్యాయాధికారులను ఆదేశించింది.

Covid Deaths Genocide : ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ -19 బాధితులు మరణిస్తున్నారనే వార్తలను ధృవీకరించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో, మీరట్ జిల్లా న్యాయాధికారులను (DMs) ఆదేశించింది. కోవిడ్ రోగుల ఆస్పత్రులకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం ఒక నేరపూరిత చర్యగా కోర్టు పేర్కొంది. అంతేకాదు.. ఇది మారణహోమం కంటే తక్కువ కాదని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినప్పుడు.. ఎందుకు ఇలాంటి ఆక్సిజన్ కొరత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు సూటిగా ప్రశ్నించింది.

గుండె మార్పిడి, బ్రెయిన్ సర్జరీల వంటి అత్యాధునిక చికిత్సలతో అడ్వాన్సడ్ గా ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తోందని జస్టిస్ సిద్ధార్థ వర్మ, అజిత్ కుమార్‌ల ధర్మాసనం ప్రశ్నించింది. ఆక్సిజన్ కొరతపై తక్షణమే పరిష్కారించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 48 గంటల్లోపు ఆక్సిజన్ కొరత వార్తా నివేదికలను పరిశీలించి, తదుపరి నివేదిక శుక్రవారం నాటికి నివేదికలను సమర్పించాలని కోర్టు డీఎంలను కోరింది.

అలాగే విచారణకు హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. మీరట్ మెడికల్ కాలేజీలో ఆదివారం కొత్త ట్రామా సెంటర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ఐదుగురు కరోనాతో మరణించారు. లక్నోలోని సన్ హాస్పిటల్‌లో మరణాల వార్తా నివేదికలను ఈ ఉత్తర్వులో పేర్కొంది. మీరట్‌లోని మరొక ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా మరణాలపై నివేదికలను కూడా కోర్టు పేర్కొంది.

ఆక్సిజన్ అందక కరోనాతో మరణించిన వారిపై విచారణ జరిపించాలని డీఎంలను కోరినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కోవిడ్ ప్రోటోకాల్స్ మార్గదర్శకాలు ఉల్లంఘించినట్టు కోర్టు దృష్టికి వచ్చింది. ఆగ్రాలోని కౌంటింగ్ కేంద్రాల నుంచి సిసిటివి ఫుటేజ్ ని కోర్టు కోరింది. కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘించినట్లు తేలితే కార్యాచరణ ప్రణాళికను తీసుకురావాలని న్యాయమూర్తులు ఎస్‌ఇసిని కోరారు.

ట్రెండింగ్ వార్తలు