Covid Positive During Pregnancy Haryana Woman Gives Birth To Child Infected With Disease
Corona positive pregnant delivery..baby positive : కరోనా కరోనా నువ్వేం చేస్తావు అంటే ..‘పుట్టకముందే పట్టుకుంటాను’అందట. అన్నట్లుగా ఉంటుంది. ఈ పసిగుడ్డు పరిస్థితి గురించి తెలిస్తే..ఈ కరోనా కాలంలో గర్భిణులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డకు ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ ఎంత జాగ్రత్తలు తీసుకున్నాగానీ జరగాల్సిందే జరుగుతుంది అన్నట్లుగా ఉందీ తల్లి పరిస్థితి. గర్భంతో ఉన్నతల్లికు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కడుపులో ఉన్న పసిగుడ్డుకు కరోనా పాజిటివ్ వచ్చింది…!! ఆమె ప్రసవించగానే బిడ్డకు పరీక్షలు చేయగా బిడ్డకు కూడా పాజిటివ్ వచ్చిన ఘటన హర్యానాలో జరిగింది.
తల్లి నుంచి కడుపులోని బిడ్డకూ కరోనా వైరస్ సోకిన అరుదైన ఘటన హర్యానాలో జరిగింది. ఇప్పటిదాకా తల్లి కడుపులోని బిడ్డకు కరోనా సోకదని చాలా మంది నిపుణులు తమ విశ్లేషణల్లో తెలిపారు. అలా పుట్టే పిల్లలు చాలా అరుదు అని వివరిస్తున్నారు. కానీ హర్యానాలోని ఆయుష్మాన్ భవ్ అనే ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ ఉన్న మహిళ ప్రసవించగా..కరోనా పాజిటివ్ ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే బిడ్డకు పరీక్షలు చేయగా పాజిటివ్అని తేలింది. దీంతో డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
కాగా..ప్రసవించిన మహిళ గర్భంతో ఉండగా మొదటిగా ఆమె భర్తకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతను ఐసోలేషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆమెకు అనుమానంగా ఉండటంతో పరీక్షలు చేయించుకోగా ఆమెకు కూడా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో పలు ఆసుపత్రులకు తిరిగారు. కానీ ఆమెకు కరోనా పాజిటివ్ అని తెలిసి ప్రైవేట్ ఆసుపత్రులు ఆమెను చేర్చుకునేందుకు అంగీకరించలేదు. చివరకు ఆయుష్మాన్ భవ్ ఆసుపత్రి యాజమాన్యం ఆమెను అడ్మిట్ చేసుకుని ప్రసవం చేసింది.
అలా పుట్టిన బిడ్డకూ కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించి డాక్టర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. హర్యానాలో ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారి అని ప్రసవం చేసిన డాక్టర్ తెలిపారు. కడుపులో ఉండగానే బిడ్డకు కరోనా సోకడం చాలా అరుదని చెప్పారు.