Modi (4)
CoWin Platform కోవిడ్ వ్యాక్సినేషన్ ఫ్లాట్ ఫాం కోవిన్(CoWIN)యాప్ ను ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం కోవిన్ గ్లోబల్ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ…మానవత్వం,మానవజాతి ప్రయోజనం కోసం అన్ని దేశాలు కలికట్టుగా పనిచేయాలని కరోనా నేర్పిన అతిపెద్ద పాఠం. మనం ఒకరినుంచి ఒకరు నేర్చుకోవాలి మరియు మన ఉత్తమ పద్ధతుల గురించి ఒకరికొకరు మార్గనిర్దేశం చేయాలి. కరోనా మహమ్మారి ప్రారంభం నుండే భారతదేశం..తన అనుభవాలు, నైపుణ్యం మరియు వనరులను ప్రపంచ సమాజంతో పంచుకుంటూ వచ్చిందని మోదీ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందినవారికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. గత వందేళ్లలో కరోనా లాంటి మహమ్మారి మరొకటి రాలేదని అన్నారు. ఏ దేశం అయినా, ఎంత శక్తివంతంగా ఉన్నా, ఇలాంటి సవాళ్లను ఒంటరిగా ఎదుర్కోలేదని అనుభవం తెలియజేస్తుందని ప్రధాని అన్నారు.
కోవిడ్ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడేందుకు వ్యాక్సినేషన్ విధానం ఒక్కటే మానవళికి ఆశాకిరణం అని మోదీ అన్నారు. కోవిడ్‌పై పోరాటంలో టెక్నాలజీ కూడా సహకరించిందని, అదృష్టవశాత్తు సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి అవరోధాలు లేవని, అందుకే కోవిడ్ ట్రేసింగ్, ట్రాకింగ్ యాప్‌ను ఓపెన్ సోర్సుగా మార్చినట్లు ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలకు కోవిన్ పోర్టల్ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంటుందన్నారు. కోవిన్ యాప్‌తో వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్ సాధించినట్లు ఆయన చెప్పారు. మన దేశంలో ముందు నుంచి వ్యాక్సినేషన్ కోసం డిజిటల్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
ఇక, ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించటం భారత నాగరికతలో అంతర్భాగమేనని మోదీ ఇవాళ చేసిన ఓ ట్వీట్ లో తెలిపారు. మహమ్మారి వేళ ఈ తత్వాన్ని అందరూ అర్థం చేసుకున్నారన్నారు. అందుకే కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన కోవిన్ టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌ను ఓపెన్ సోర్స్‌గా చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. కాగా,ప్రస్తుతం కెనడా, మెక్సికో, నైజీరియా సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాలు కొవిన్ యాప్‌ను తమదేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.