CoWIN portal: ప్రాంతీయ భాషల్లోనూ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్

CoWIN portal in regional languages: కరోనా కట్టడికి వ్యాక్సిన్ వేయించుకోవడమే మార్గం అని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన ప్రభుత్వం.. కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొవిన్ పోర్టల్‌ను ఇప్పుడు హిందీతో సహా పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

తెలుగు, మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా భాషల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో జరిగిన మంత్రుల సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈమేరకు మార్పులు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

18ఏళ్ల నుంచి 45ఏళ్లమ మధ్య వయసు కలవారు వ్యాక్సిన్ తీసుకోవాలంటే మాత్రం కచ్చితంగా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో భాష కారణంగా సమస్యలు ఎదురుకాకూడదనే ప్రాంతీయ భాషలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. ఒత్తిడి లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఈ నిర్ణయం సాయం చేస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 22కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌లు వేయించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు