Karnataka elections 2023
Karnataka elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు సీపీఐ ప్రకటన చేసింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉండగా, 215 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇస్తామని సీపీఐ ఆదివారం ప్రకటన చేసింది. సీపీఐ ఇప్పటికే కర్ణాటకలో ఏడుగురు అభ్యర్థులను తమ తరఫున పోటీకి నిలబెట్టింది.
అయినప్పటికీ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పింది. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మతసామరస్యాన్ని చెడగొట్టేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్య, వైద్య రంగాల్లో సౌకర్యాల లేమి వంటి సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఐ ఆరోపించింది. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ కర్తవ్యమని చెప్పుకొచ్చింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక పర్యటనలో ఉన్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఇవాళ ఆయన బసవ జయంతి వేడుకలో పాల్గొన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు మే 8న జరుగుతాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే దశలవారీగా తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి.
Minister Niranjan Reddy: ఒక్క ఆరోపణ రుజువు చేసినా రాజీనామా చేస్తా.. బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రి నిరంజన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్