Cyclone Tauktae: తౌక్తా తుఫాను.. రెండు రాష్ట్రాలకు వరద ముప్పు.. విమానాలపై ప్రభావం

Cyclone Tauktae: కరోనాతో దేశం అల్లాడిపోతుండగా.. ఇదే సమయంలో తౌక్తా తుఫాన్ గండం వస్తుంది. కేరళలోని కొచ్చి తీరానికి దగ్గరలో ఏర్పడ్డ తౌక్తా తుఫాను భీకర తుఫానుగా మారి వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సెంట్రల్ వాటర్ కమీషన్ వెల్లడించింది. ఈ రోజు మధ్యాహ్నంలోపు తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణశాఖ చెబుతుంది.

ప్రతికూల వాతావరణం కారణంగా విస్టారా మరియు ఇండిగో ఎయిర్‌లైన్స్ చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, బెంగళూరు, ముంబై, పూణే, గోవా మరియు అహ్మదాబాద్‌లకు విమానాశ్రయాల్లో విమానలకు హెచ్చరికలు జారీ చేశాయి. వాస్తవానికి, ఆదివారం నాటికి శక్తివంతమైన తుఫానుగా తౌక్తా మారనుంది. రాబోయే నాలుగు రోజుల్లో ఈ తుఫాను గుజరాత్, మహారాష్ట్ర, కేరళ తీరాలను తాకే అవకాశం ఉందని, కేరళ, తమిళనాడులలో వరదలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ క్రమంలోనే కేరళలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. మలప్పురం, కోజికోడ్‌, కన్నూర్‌, వయనాడ్‌, కాసర్‌గోడ్‌తో సహా ఉత్తర జిల్లాలో 20 సెంటీమీటర్ల కంటే భారీ వర్షాపాతం నమోదవుతుంది. ఈ మేరకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయగా.. కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్‌ల్లో ఆరెంజ్‌ అలర్ట్‌, తిరువనంతపురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ అయ్యింది. కోజికోడ్ జిల్లాలోని వడకర గ్రామంలో వంద కుటుంబాలకు 310 మందితో పాటు లోతట్టు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు.

కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ 53 బృందాలను అందుబాటులో ఉంచింది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ కేరళ, తమిళనాడుకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో నీటి మట్టం ప్రమాదంగా ఉందని, కేరళలోని అచన్‌కోవిల్‌, తమిళనాడులోని కొడయార్‌ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని హెచ్చరించింది. కరోనా కారణంగా సహాయచర్యలకు కూడా ఆటంకం కలగవచ్చునని నిపుణుల అంచనా.

ట్రెండింగ్ వార్తలు