పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.155 కోట్లు విరాళమిచ్చిన D-Mart 

  • Publish Date - April 5, 2020 / 03:58 AM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో దేశంలోని కరోనా బాధితుల కోసం సాయం చేసేందుకు చాలామంది ప్రముఖులు, సంస్థలు ముందుకు వస్తున్నాయి. తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటిస్తున్నాయి. Covid-19 వైరస్‌పై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి అవెన్యూ సూపర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ D-Mart సైతం పీఎం కేర్స్ ఫండ్‌ రూ.155 కోట్లను విరాళంగా ప్రకటించింది. 

ఈ మేరకు డిమార్ట్ ప్రమోటర్ రాధాక్రిష్ణన్ డామని ఒక ప్రకటనలో వెల్లడించారు. PM CARES Fund కు రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించిన డిమార్ట్.. కరోనా ప్రభావిత 11 రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్వహించే రిలీఫ్ ఫండ్లకు మిగిలిన రూ.55 కోట్లను విరాళంగా ఇచ్చినట్టు అవెన్యూ సూపర్ మార్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మా ప్రమోటర్ రాధాకృష్ణన్ డామని ద్వారా తన గ్రూపు కంపెనీ బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ నుంచి పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.100 కోట్లు విరాళమిచ్చారు. మిగిలిన మొత్తం రూ.55 కోట్లను వివిధ రాష్ట్రాల రిలీఫ్ ఫండ్లకు విరాళంగా ఇవ్వడం జరిగింది’ అని తెలిపింది. 

ప్రజల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సంస్థలు తీసుకునే చర్యలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో తమ మద్దుతు ఉంటుందని డిమార్ట్ వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశంలో మూడు వారాల లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14న లాక్ డౌన్ ముగియనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం.. దేశంలో కొవిడ్-19 కేసులు శనివారం (ఏప్రిల్ 4, 2020) నాటికి 3వేల మార్క్ ను దాటేశాయి. ఆ తర్వాత దేశంలో కొత్తగా 525 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.