×
Ad

Darjeeling Landslides : డార్జిలింగ్‌లో వర్ష బీభత్సం.. కూలిన వంతెన.. విరిగిపడిన కొండచరియలు.. చిన్నారులుసహా 17మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ..

Darjeeling Landslides డార్జిలింగ్ కొండలలో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి.

Darjeeling Landslides

Darjeeling : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్‌, కాలింపాంగ్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు మార్గాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. డార్జిలింగ్‌లోని మిరిక్ ప్రాంతంలో మిరిక్, కుర్సియాంగ్ పట్టణాలను కలిపే దుడియా ఇనుప వంతెన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కూలిపోయింది. ఈ ప్రమాదంతోపాటు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మొత్తం 17మంది మరణించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు అటంకం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

డార్జిలింగ్ కొండలలో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. అనేక మారుమూల గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. 717 జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడడంతో సిక్కిం – సిలిగుడి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తీస్తా, మాల్ పర్వత ప్రాంత నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.

Also Read: Baby Death Case : ఏపీలో పసిబిడ్డ మృతి ఘటనలో సంచలన విషయాలు.. విచారణకు ఆదేశించిన మంత్రి .. వాళ్ల నిర్లక్ష్యమే కారణమా..?

భూటాన్ లో బారీ వర్షాల నేపథ్యంలో బెంగాల్ కు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు. డార్జిలింగ్ లోని పర్యాటక ప్రదేశాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కొండచరియలు విరిగిపడడంతో మిరిక్ – సుఖియాపోఖారి రహదారితో సహా ప్రధాన మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే, అనేక కొండ ప్రాంత స్థావరాలకు కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయింది. తాజా పరిస్థితిపై ఉత్తర బెంగాల్ అభివృద్ధి మంత్రి ఉదయన్ గుహా మాట్లాడుతూ.. భారీ వర్షాలకారణంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. పలు ఘటనల్లో పదిహేడు మంది మరణించారని చెప్పారు. మాకు అందిన నివేదికల ప్రకారం.. మిరిక్ లో 11 మంది, డార్జిలింగ్ లో ఆరుగురు మరణించారు. కానీ, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

పశ్చిమ బెంగాల్ ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డార్జిలింగ్ లో వంతెన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం తీవ్ర బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోరుకోవాలని మోదీ ఆకాంక్షించారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో డార్జిలింగ్, పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.