చౌకగా అందేలా…వ్యాక్సిన్ పంపిణీకి స్పష్టమైన వ్యూహం అవసరం

చౌక ధరల్లో కరోనా వ్యాక్సిన్​ ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఇందుకు స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలన్నారు. కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ తయారు చేసే సామర్థ్యం భారత్​కు ఉందని రాహుల్ గాంధీ అన్నారు.

కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే దేశాల్లో భారత్​ ఒకటి. ప్రజలకు చౌకగా, నిజాయతీగా టీకా సరఫరా జరగాలి. ఇందుకు స్పష్టమైన వ్యూహం అవసరం. దీన్ని భారత ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి అని రాహుల్ ట్వీట్ చేశారు. అంతకుముందు దేశంలో కరోనా పరిస్థితిపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్​లో కరోనా పరిస్థితి భయానకంగా ఉందన్నారు.

మరోవైపు, గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 67 వేల కేసులు నమోదు కావడంపై రాహుల్ స్పందిస్తూ.. కరోనా వ్యాప్తి గ్రాఫ్‌ నిలకడ కావడానికి బదులు భయపెడుతోంది (ఫ్రైటెనింగ్‌ నాట్‌ ఫ్లాటెనింగ్‌)అని వ్యాఖ్యానించారు.

మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగ్గా నిలకడగా ఉందంటూ కేంద్రం చెబుతుండటంపై ట్విట్టర్‌లో ఆయన..ప్రధాని చెబుతున్న విధంగా ఇది నిలకడగా ఉన్న పరిస్థితే అయితే, దిగజారుతున్న పరిస్థితి అని ఎప్పుడనొచ్చు?అంటూ ఎద్దేవా చేశారు.