అంబులెన్స్‌లో గుండె : 18.5 కిలోమీటర్లు, 12 నిమిషాలు

Delhi Airport Green Corridor : ఓ యువకుడి ప్రాణాలను కాపాడేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్స విషయంలో ఎయిమ్స్‌  (All India Institute of Medical Sciences) అభ్యర్థనపై ఢిల్లీ పోలీసులు అద్భుతంగా స్పందించారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిమ్స్‌ (AIIMS)కు గుండె తరలింపులో ఎలాంటి జాప్యం లేకుండా అంబులెన్స్‌ వెళ్లేందుకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. దీంతో 18.5 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 12 నిమిషాల్లోనే అంబులెన్స్‌ చేరుకోగలిగింది. గుజరాత్‌లోని వడోదర (Vadodara) నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi Airport) టెర్మినల్‌-2 (Terminal-2) వద్దకు గుండెను తీసుకొస్తున్నట్టు ఎయిమ్స్‌ వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గుండెమార్పిడి శస్త్రచికిత్స కోసం సమయం వృథా కాకుండా త్వరగా తీసుకొచ్చేలా సహకరించాలని పోలీసులను కోరారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు.. దీనికోసం అధికారులను నియమించి గ్రీన్‌ కారిడార్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. విమానాశ్రయం నుంచి అంబులెన్స్‌ వెళ్లేందుకు జాప్యం జరగకుండా గ్రీన్‌ కారిడార్ (Green Corridor)‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు టెర్మినల్‌-2 నుంచి పైలెట్‌గా ఎయిమ్స్‌ వరకు వచ్చారు. దీంతో వాహనాలతో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ రహదారుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా అంబులెన్స్‌ కేవలం 12 నిమిషాల్లోనే ఆస్పత్రికి చేరుకోగలిగింది.

మామూలుగా అయితే విమానాశ్రయం నుంచి ఎయిమ్స్‌కు రావాలంటే 35 నుంచి 40 నిమిషాలు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. అరుదైన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 20 ఏళ్ల యువకుడికి ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. వడోదరలో బ్రెయిన్‌ డెడ్‌కు గురైన 17 ఏళ్ల బాలిక గుండెను తీసుకొచ్చి యువకుడికి అమర్చారు. ఎయిమ్స్‌ (AIMS)లో ఈ ఏడాది జరిగిన గుండె మార్పిడి శస్త్రచికిత్సలో ఇది మూడోది.