ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం

కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేజ్రివాల్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రిజిస్ట్రేషన్ నెంబరులో చివరి అంకె సరి ఉన్న వాహనాలు ఒక రోజు.. బేసి ఉన్న వాహనాలు మరో రోజు రోడ్డు మీదకు రావాలి. 

ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో  2016లో మొదటి సారిగా సరి-బేసి విధానాన్ని కేజ్రీవాల్ సర్కార్ ప్రయోగాత్మకంగా అమలుచేసింది.  ఆ తర్వాత పలుసార్లు సరిబేసి విధానాన్ని కేజ్రీవాల్ సర్కార్ విజయవంతంగా అమలు చేసింది. వాయుకాలుష్యాన్ని కంట్రోల్‌ చేయడానికి  ఆప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సరి-బేసి విధానం మంచి ఫలితాలే ఇచ్చింది. ఇప్పుడు మరోసారి సరి బేసి విధానాన్ని తీసుకురాబోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

అయితే ఢిల్లీలో సరి-బేసి విధానం అవసరం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. తాము నిర్మించిన రింగ్ రోడ్డు ఢిల్లీ సిటీలో  పొల్యూషన్ ని క్రమంగా తగ్గిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. రాబోయే రెండేళ్లలో ఢిల్లీలో పొల్యూషన్ లేకుండా తాము ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.